Thursday, May 2, 2024

నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ దీపావళి కానుక.. పోలీసుశాఖలో 6511 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. పోలీసు శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీపావళి కానుకగా మొత్తం 6,511 పోలీసు ఉద్యోగాలను కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్‌, 3,580 సివిల్‌ కానిస్టేబుల్‌, 315 సివిల్‌ ఎస్‌ఐ, 96 రిజర్వ్‌ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం ముద్ర వేయగా ఈమేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి జూలైలోనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర అవసరాలు, ఖాళీలు, కొత్త జిల్లాల తర్వాత అవసరమైన అదనపు పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఇదివరకే పోలీసు శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చర్చించారు. ఖాళీలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను అప్పుడే ఆదేశించారు. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఖాళీలపై పోలీస్‌ శాఖ కసరత్తు చేసింది.

రాష్ట్రంలో 2019లో జరిగిన నియామకాల తర్వాత మళ్ళీ పోలీసు ఉద్యోగాల ఎంపిక జరగలేదు. గడిచిన మూడేళ్ళలో పదవి విరమణలు, పదోన్నతులు, ఇతర కారణాలతో పోలీసు శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. పైగా 2019 తర్వాత కోవిడ్‌ సంక్షోభంతో నియామకాలు లేవు. క్రమేణా ఏర్పడిన ఖాళీలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వారాంతపు సెలవు అమలుకు సిబ్బంది కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖలో ప్రస్తుతమున్న దాదాపు 60వేలకు పైగా ఉన్న సిబ్బంది కాక వీక్లీ ఆఫ్‌ అమలు చేయాలంటే అదనంగా మరో 10,781 మంది అవసరం ఉంది. అంటే ఖాళీలతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో భాగంగా 6,511 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మిగతా పోస్టులను దశలవారీగా భర్తీ చేయడం జరుగుతుంది.

డీజీపీ ప్రతిపాదనల మేరకు..

- Advertisement -

కాగా.. ఖాళీలపై కసరత్తు చేసిన మీదట డీజీపీ కేవీ రాజేంద్రనాధ్‌ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం 6511 పోస్టుల్లో ఏపీఎస్పీ 4 బెటాలియన్‌ లలో 96 రిజర్వు ఏస్‌ఐలు, 2520 రిజర్వు కానిస్టేబుళ్ళు, 315 మంది సివిల్‌ ఎస్‌ఐలు, 3580 సివిల్‌ కానిస్టేబుళ్లు భర్తీ చేయాల్సిఉందని పేర్కొన్నారు. మొత్తం 6511 పోస్టులు స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూ-టె-్మంట్‌ బోర్డు (ఎస్‌ఎల్పీఆర్బీ) ద్వారా నియామక ప్రక్రియ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీకి పచ్చజెండా ఊపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement