Wednesday, May 8, 2024

ఇదేం ట్రిపుల్‌ ఐటీ…? కనీస సౌకర్యాల్లేక అల్లాడుతున్న విద్యార్థులు : ఎంపీ సోయం బాపూరావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వేలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్‌ను నిర్దేశించే బాసర ట్రిపుల్‌ ఐటీ విశవిద్యాలయ పరిస్థితిని చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతోందని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు వాపోయారు. రాష్ట్ర ప్రభుత నిర్లక్ష్యం వల్ల ట్రిపుల్‌ ఐటీ నిర్వహణ లోపభూయిష్టంగా మారిందని ఒక ప్రకటనలో మండిపడ్డారు. రెగ్యులర్‌ వైస్‌ ఛాన్సలర్‌, డైరెక్టర్‌ లేరు, విద్యార్థుల సంఖ్యకు సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరన్నారు. ల్యాబ్‌ అసిస్టెంట్‌తో పాఠాలు చెప్పించే దుస్థితి నెలకొందని, వేలాది మంది విద్యార్థులున్న ఈ విశవిద్యాలయంలో ఒకే ఒక్క ఫిజికల్‌ డైరెక్టర్‌ కొనసాగుతుండటం ఆశ్చర్యమేస్తోందన్నారు. విశవిద్యాలయంలో కనీస సౌకర్యాల్లేవని, రేకుల షెడ్లలో పాఠాలు చెబుతున్నారన్నారు. ఫ్యాన్లు లేవు, ఏసీ పని చేయడం లేదని తెలిపారు. కుర్చీలు డిజిటల్‌ బోర్డ్స్‌, డెస్క్‌లన్నీ చెడిపోయాయని, ప్రొజెక్టర్‌ అసలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. మండుటెండలో రేకుల షెడ్లలో ఫ్యాన్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు అల్లాడిపోతున్నా పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించడం లేదని, కనీసం యూనిఫాం, షూ, ఐడీ కార్డులు కూడా ఇవడం లేదంటే ట్రిపుల్‌ ఐటీ ఎంతటి దుస్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇక హాస్టల్‌లో పరిస్థితులు అధాన్నంగా మారాయని, వాడిపారేసిన పాత పరుపులేవిద్యార్థులకు దిక్కయ్యాయన్నారు. 9వేల మంది విద్యార్థులకు మూడు మెస్‌లు మాత్రమే ఉన్నాయని, అవి కూడా అత్యంత దరిద్రంగా మారాయన్నారు.

వేలాది మంది పిల్లలు ఒకేసారి భోజనం చేయాల్సి రావడంతో వారిని కంట్రోల్‌ చేయడం కష్టసాధ్యంగా మారుతుందని, చదువుకునే వారంతా పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతం వారేకదా వాళ్లు ఏ భోజనం పెట్టినా అడిగే వారెవరు ఉండరనే నిర్లక్ష్యం మెస్‌ నిర్వాకుల్లో కన్పిస్తోందన్నారు. అందుకే వారు వడ్డించే భోజనంలో తెల్ల పురుగులు, కప్పలు కన్పించడం నిత్యకృత్యంగా మారిందన్నారు. తాగడానికి మంచి నీరు కూడా అందించలేని దుస్థితి నెలకొందని, పురాతనమైన వాటర్‌ ఫిల్టర్‌ నిర్వ‌హణ కూడా సరిగా లేదన్నారు. హాస్టల్‌లో శుభ్రత కరువై దోమలు, ఈగలు, పురుగులతోనే విద్యార్థులు నానా అవస్థలు పడుతుంటే గుండె తరుక్కుపోతోందన్నారు.

ఫీజుల ద్వారా ఏటా రూ. 40 కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నా విశవిద్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ ఐటీ దుస్థితిని చూస్తుంటే వేలాది మంది విద్యార్థులు భవిష్యత్‌ ఏమవుతుందోననే ఆవేదన కలుగుతోందని, ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహంచరానిదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ వీసీ, డైరెక్టర్‌తోపాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస సౌకర్యాలు కల్పించాలని, లేనిపక్షంలో బీజేపీ పక్షాన తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎంపీ హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement