Sunday, April 28, 2024

ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు: జూలూరు గౌరీశంకర్

తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఇక్కడి కవులు, రచయితలు సహించరని తిరుగబడతారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడిన తీరుపై ఆయన ప్రతిస్పందించారు. జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భజలాల పరిరక్షణకై హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగు నీటి శుద్ధి సంస్థ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారంనాడు జరిగిన 300 మంది కవుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్ దార్శనిక ఆలోచనలతో గోదావరి నదినే ఎత్తిపోసి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ దాహార్తి తీర్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ నేలమీద పడ్డ ప్రతినీటి బొట్టును వొడిసి పట్టి కోటి ఎకరాల మాగాణం చేసి తెలంగాణను దేశానికి ఆకలితీర్చే ధాన్యాగారంగా తీర్చిదిద్దారని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవంతో తనను తాను పునర్మించకుంటూ ముందుకు సాగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ వచ్చినాక గల తేడాను దేశమంతా గమనిస్తుందన్నారు. తెలంగాణ నేల పైకి గంగమ్మను రప్పించిన కాళేశ్వరం కీర్తిని ఇక్కడి కవులు, రచయితలు అనేక కావ్యాలలో లిఖించారని గుర్తుచేశారు.

ఒకనాడు జలాల కోసం పోరాడిన కవులు, రచయితలు నేడు జల సంరక్షణలో కూడా తమవంతు చారిత్రక పాత్రను పోషిస్తారని జూలూరు గౌరీశంకర్ విశ్లేషిస్తూ ప్రసంగించారు. జలసంరక్షణ ఉద్యమంలో పాలు పంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది కవులు రావటం ఆహ్వానించతగిందని జలమండలి ఓఎల్డీ సత్యనారాయణ, జలమండలి 6వ డివిజన్ జనరల్ మేనేజర్ ఎస్. హారిశంకర్ అన్నారు. ఈ సభకు రచయిత కె. గోపార్టీ అధ్యక్షత వహించగా గాంధీ సంస్థల ఛైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, గాంధీ సంస్థల ఛీష్ అడ్వయిజర్ ఎం.వి. గోనారెడ్డి, జలమండలి 6వ డివిజన్ డిజిఎమ్ వి.శ్రీనివాసులు, మేనేజర్స్ మౌనిక, శివ, ఎఫ్ఓ మోహన్, కేజీటు పేజీ అసోసియేషన్ అధ్యక్షులు గింజల రమణారెడ్డి కవిసమ్మేళన నిర్వహాణ ప్రతినిధులు డా॥యానాల ప్రభాకర్రెడ్డి, డా॥ మైనేని వాణి, పి.గిరిధర్ గౌడ్, ఎం.డి. ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జల సంరక్షణ కరపత్రాన్ని సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు. గౌరీశంకర్ ఆవిష్కరించారు. కవులు, రచయితలు జలప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతల్లో అతిథులు ఇసుక పోశారు. సభలో పాల్గొన్న 300 మంది కవులను నిర్వహకులు ఘనంగా సత్కరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement