Friday, April 26, 2024

మోదీతోనే దేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు.. ప్రశంసలతో ముంచెత్తిన ఉపరాష్ట్రపతి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆధునిక భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దిగ్గజ నాయకుల్లో ఒకరిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభివర్ణించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో ‘మోడీ @ 20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. గడచిన 20 ఏళ్లలో 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా వివిధ రంగాల్లో మోదీ ఆలోచనలు, పనితీరుపై 22 మంది నిపుణులు రూపొందించిన 21 కథనాల సంకలనమే ఈ పుస్తకం. మోదీ మనస్సు, పద్ధతులు, దార్శనికత గురించి ఉపరాష్ట్రపతి వివరిస్తూ నాడు గుజరాత్‌కు, ఇప్పుడు యావద్దేశానికి మోదీ ఒక విశిష్ట నాయకుడిగా మన్ననలు అందుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రధాని మోదీకి ఉన్న విశిష్ట లక్షణాలను విశదీకరించారు.

17 ఏళ్ల వయస్సులో ఇల్లు వదిలి బయల్దేరిన మోదీ దేశమంతటా తనను తాను వెతుక్కుంటూ విస్తృతంగా పర్యటించి, అనేక మంది ప్రజలను కలిసి సామాజిక, దేశం సాంస్కృతిక స్థితిగతులను స్వయంగా పరిశీలించారని వెంకయ్య నాయుడు అన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా మొదలై, ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమంలో దేశం పట్ల విస్తృతావగాహన ఏర్పర్చుకున్నారని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, ప్రజల శక్తిసామర్థ్యాలపై ఆయనకు లోతైన అవగాహన ఉందన్నారు. పెద్ద పెద్ద స్వప్నాలను కలిగి ఉండడమే కాదు, వాటిని సాకారం చేసుకోడానికి అవసరమైన సంకల్పం, దృఢ నిశ్చయం మోదీలో పుష్కలంగా ఉన్నాయని అన్నారు. విభిన్నంగా ఆలోచించడం, అంతే విభిన్నంగా అమలు చేయడం కూడా మోదీ ప్రత్యేక లక్షణాల్లో ఒకటని పేర్కొన్నారు. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ మోదీ దిట్ట అని వెంకయ్య నాయుడు కొనియాడారు. కొన్ని వైఫల్యాలు ఎదురైనా, అనుకోని అవాంతరాలు ఎదురైనా ఏమాత్రం అధైర్యపడకుండా వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లడం కూడా ఆయనలో మనం చూడవచ్చని అన్నారు. సంక్షోభాలను అవకాశంగా మలచుకోవడంలో మోదీలోని విశిష్ట లక్షణంగా ఉపరాష్ట్రపతి విశదీకరించారు. విధానాల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండేలా చేస్తూ దిగువస్థాయి వరకు ఆ విధానాన్ని తీసుకెళ్లి ఆచరణలోకి తీసుకొచ్చారని తెలిపారు. తొలుత సీఎంగా గుజరాత్‌లో ప్రయోగాత్మకంగా అమలుచేసి, విజయాలు సాధించిన అనేక కార్యక్రమాలను తర్వాతికాలంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని చెప్పారు. అలాగే అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగైన పాలన అందించడం కోసం సద్వినియోగం చేసుకోవడంలోనూ మోదీ ముందువరుసలో ఉన్నారని అన్నారు. ‘పెర్ఫార్మ్ (పనిచేయడం), రిఫార్మ్ (సంస్కరించడం) అండ్ ట్రాన్స్‌ఫార్మ్ (మార్పు తీసుకురావడం)’ అన్నదే తారకమంత్రంగా ప్రధాని మోదీ పనిచేస్తారని కొనియాడారు.

మొత్తంగా ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై గుర్తింపును, విశేష గౌరవాన్ని పొందుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఈ విషయాన్ని ఆయన వ్యతిరేకులు కూడా అంగీకరిస్తున్నారని తెలిపారు. గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రధాన మంత్రితో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రతి విషయంలోనూ పటిష్టమైన విధానాలు, వైఫల్యానికి ఆస్కారం లేని ప్రణాళికలతో కార్యక్రమాలు అమలుచేసేవారని అన్నారు. ప్రత్యేకించి స్వచ్చ్ భారత్ ప్రచారాన్ని ఒక సాధారణ ప్రభుత్వ కార్యక్రమంగా చూడకుండా.. ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ ‘జన్ ఆందోళన’గా తీర్చిదిద్ది వారిలో మార్పు తీసుకొచ్చారని తెలిపారు. ఆయన ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టాలని భావిస్తే, అది ఎంత పెద్దది అన్న దాంతో సంబంధం లేకుండా మొదలుపెట్టి పూర్తిచేస్తారని, అందుకు ఊదాహరణగా బ్యాంకు ఖాతాలు లేని 45 కోట్లకు పైగా ప్రజలకు ఖాతాలు తెరిపించడమేనని వెంకయ్య నాయుడు అన్నారు. అలాగే 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం, 3 కోట్లకు పైగా పేదలకు నివాస గృహాలు; 5 కోట్లకు పైగా ముద్రా రుణాలు మంజూరయ్యాయని గణాంకాలతో సహా చెప్పారు. అలాగే సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా ప్రయోజనాలు జమయ్యేలా DBT విధానంతో 320 పథకాల కింద కోట్ల రూపాయాలు లబ్ధిదారులకు బదిలీ అయ్యాయని గుర్తుచేశారు. అలాగే 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు,19 కోట్ల గృహాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేస్తూ పేద గృహాల్లో వెలుగులు నింపారని కొనియాడారు.

మోదీని ‘ఎన్నికల యంత్రం’గా పిలువడాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నికలు రాజకీయాల పరిణామం కాదని, సామాన్య ప్రజల జీవిత స్థితిగతులు, ఆకాంక్షలపై లోతైన అవగాహనతో కూడిన సామాజిక శాస్త్రమని నాయుడు పేర్కొన్నారు. ఆక్రమంలో మోదీ ఒక విజయవంతమైన ప్రచారకర్తగా అభివర్ణించారు. చెదిరిన తమ కలలను నిజం చేస్తూ భారతదేశాన్ని సుసంపన్నం చేసే వ్యక్తిగా ప్రజలు మోదీని చూస్తున్నారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇతర సీనియర్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement