Saturday, April 27, 2024

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. నాలుగు నెలల తర్వాత గరిష్ట సంఖ్యలో నమోదు

దేశంలోని అనేక రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఓవైపు ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను కేంద్రం గురువారం అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక ఉన్నాయి. మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. టెస్ట్‌ ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని అనుసరించాలని లేఖలో కోరింది. కాగా, నాలుగు నెలల తర్వాత భారత్‌లో అత్యధిక సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి. గతేడాది నవంబర్‌లో 734 కొవిడ్‌ కేసులు నమోదవగా, ఆ స్థాయిలో మళ్లి నమోదవడం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారితో కర్ణాటకలో ఒకరు మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్‌ డోస్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

- Advertisement -

ఆందోళన కలిగిస్తున్న ఫ్లూ..ఆందోళన కలిగిస్తున్న ఫ్లూ..

ఇన్ఫ్లుఎంజా వైరస్‌ ఉపరకం హెచ్‌3ఎన్‌2 దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. మహారాష్ట్ర, గుజరాత్‌, హర్యానా, ఒడిశా, ఢిల్లి సహా పలు రాష్ట్రాల్లో వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా తప్పనిసరిగా నివారణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ వైరస్‌ గరిష్ట ప్రభావం పిల్లల్లో కనిపిస్తోందని ఇటీవల పలు నివేదికలు పేర్కొన్నాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగే ఆసుపత్రిలో చేరే ప్రమాదం పెంచుతుందని నివేదికలు హెచ్చరించాయి.

యాంటీబయాటిక్స్‌ అతిగా తీసుకోవద్దు.. యాంటీబయాటిక్స్‌ అతిగా తీసుకోవద్దు..

ఇన్ఫ్లుఎంజా కేసులు చాలా వరకు సాధారణ మందులు, తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడాలని డాక్టర్‌ అరవింద్‌ సూచించారు. ఫ్లూ వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్‌ పని చేయనప్పటికీ, చాలా మంది దుకాణాల్లో యాంటీబయాటిక్స్‌ కొనుగోలు చేసి తీసుకుంటున్నారన్నారు. పిల్లలకు సొంత వైద్యం చేయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి.. సూచించిన మందులను మాత్రమే వాడాలని చెప్పారు. వైరస్‌ నివారణకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement