Thursday, May 16, 2024

ఢిల్లీలో హైదరాబాద్ హౌజ్.. విమోచన – విలీనం – సమైక్యతకు మౌనసాక్షి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని ఢిల్లీ అనగానే ఎవరికైనా ఇండియా గేట్ గుర్తుకొస్తుంది. దాని పక్కనే ఉన్న హైదరాబాద్ హౌజ్ గురించి తెలిసింది మాత్రం కొందరికే. ఓవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పోటాపోటీగా నిర్వహిస్తున్న వేళ భాగ్యనగరంతో అనుబంధాన్ని, వంద ఏళ్ల చరిత్రను కలిగిన, నిజాం నవాబు నిర్మించిన హైదరాబాద్ హౌజ్‌‌పై ప్రత్యేక కథనం…

న్యూఢిల్లీలో ఇండియా గేట్ సమీపంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్ ఉంది. దానిని ఆనుకుని ఇండియా గేట్‌కు ఆగ్నేయ దిశలో హైదరాబాద్ హౌజ్ ఎంతో ఠీవిగా కనిపిస్తుంటుంది. దేశ రాజధానిలో రాష్ట్రపతి భవన్ తర్వాత అతిపెద్ద రాజభవనమిదే. నాటి చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోసం నిర్మించిన ప్యాలెసే ఈ హైదరాబాద్ హౌజ్. బ్రిటిషర్లకు కప్పం కడుతూ రాజ్యాలను పాలించుకున్న సంస్థానాలు, రాజ్యాధినేతలు, నాటి బ్రిటిష్ పాలకులను కలవడానికి ఢిల్లీ వచ్చినప్పుడు ఉండడానికి వీలుగా నిర్మించుకున్న రాజభవనాలు ఇండియా గేట్ చుట్టూ ఒక్కో సంస్థానానికి ఒక్కో భవనం చొప్పున ఉన్నాయి. ఆ క్రమంలో బరోడా సంస్థానం మహారాజు కోసం బరోడా హౌజ్ (ప్రస్తుతం నార్తర్న్ రైల్వే కార్యాలయం), పాటియాలా హౌజ్ (న్యాయస్థానం), జోధ్‌పూర్ హౌజ్, జైపూర్ హౌజ్, బికనీర్ హౌజ్, ధోల్‌పూర్ హౌజ్ ఇలా నాటి సంస్థానాధీశుల అధికారిక నివాసాలెన్నో ఇప్పటికీ ఢిల్లీలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. కాకపోతే స్వాతంత్ర్య తర్వాత మన పాలకులు, ప్రభుత్వాధినేతలు మన అవసరాలకు తగినట్టు మార్పులు చేర్పులు చేయడం, పేర్లు మార్చడం వల్ల ఈ తరానికి చారిత్రక విశేషాలు తెలియడం లేదు.

1921-31 మధ్యకాలంలో హైదరాబాద్ హౌజ్ నిర్మాణం జరిగింది.  8.77 ఎకరాల విస్తీర్ణంలో సీతాకోకచిలుక ఆకారంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ హైదరాబాద్ హౌజ్‌ను నిర్మించారు. న్యూఢిల్లీ నగర ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటెన్, మరో ఆర్కిటెక్ట్ అబ్దుల్లా భంజి ఆధ్వర్యంలో ఈ భవన నిర్మాణం జరిగింది. ఇందులో భారతీయ, మొఘలాయిల నిర్మాణ శైలులతో పాటు యురోపియన్ ఆర్కిటెక్చర్ మిళితమై కనిపిస్తుంది. మొత్తం 36 గదులతో సువిశాలంగా, నిజాం రాజసం ఉట్టిపడేలా, ఖరీదైన ఇంటీరియర్స్‌తో ఈ ప్యాలెస్ ఉంటుంది. అప్పట్లో ప్రతిష్టాత్మక సంస్థలైన హ్యాంప్టన్ అండ్ సన్స్ లిమిటెడ్, వారింగ్ అండ్ గిల్లో లిమిటెడ్ సంస్థలు రాజసం ఉట్టిపడే ఇంటీరియర్ డిజైన్ కోసం కాంట్రాక్టు పొందాయి. ఇందులో మొత్తం బర్మా టేకునే వినియోగించారు. ఫర్నిచర్‌ను లండన్ నుంచి, ఎలక్ట్రికల్ వస్తువులను న్యూయార్క్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇరాఖ్, పర్షియా, తుర్కుమెనిస్తాన్, అఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్పెట్లు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి, డైనింగ్ హాళ్లలో నేటికీ వెండిప్లేట్లు, పాత్రలనే వినియోగిస్తారు. హైదరాబాద్ హౌజ్‌లోని అతిపెద్ద డైనింగ్ హాలులో ఏకంగా 500 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్‌కి తొలుత ఆ రోజుల్లోనే 26 లక్షలు అనుకున్నా ఆ బడ్జెట్ కాస్తా రూ. 50 లక్షలకు చేరుకుంది. మొత్తంగా ఈ భవనం నిర్మాణం కోసం ఆ రోజుల్లోనే 1.2 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇప్పటి విలువలో చూస్తే కొన్ని మిలియన్ల డాలర్లు అవుతుంది.

కాలక్రమంలో అనేక మార్పులకు లోనైన ఆ ప్యాలెస్ ప్రస్తుతం వివిధ దేశాధినేతలు భారత పర్యటనకు వచ్చినప్పుడు వారితో జరిపే ద్వైపాక్షిక చర్చలకు, ఒప్పందాలకు వేదికగా మారింది. ఈమధ్యకాలంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్ పర్యటనల్లోనూ హైదరాబాద్ హౌజ్‌లోనే అనేక చర్చలు నడిచాయి. చైనా అధినేత జిన్ పింగ్, ఇజ్రాయిల్ మాజీ అధ్యక్షుడు బెంజిమిన్ నెతెన్యాహు.. ఇలా ఎందరో దేశాధినేతలు సందర్శించిన భవనం హైదరాబాద్ హౌజ్. దీని నిర్వహణ బాధ్యతలను ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) చూస్తుంటాయి. తెలంగాణ విమోచన అనంతరం నిజాం తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేశాక ఈ భవనాన్ని భారత ప్రభుత్వంలోని విదేశాంగ శాఖ 1954 నుంచి లీజుకు తీసుకుంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి లీజు చెల్లిస్తూ వచ్చింది. అయితే 1970 నుంచి లీజు చెల్లింపులు జరపలేదు. 1990లలో కోట్ల విజయభాస్కర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ హౌజ్‌కు బదులుగా స్థలాన్ని తీసుకునే ఒప్పందంపై పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌తో పాటు నర్సింగ్ హాస్టల్ స్థలం, పటౌడీ హౌజ్ స్థలాలు ఇలా వచ్చినవే. సెప్టెంబర్ 17వ తేదీని కొందరు విమోచన దినమని, మరికొందరు విలీన దినమని, ఇంకొందరు సమైక్యతా దినం అంటూ వేర్వేరు పేర్లతో పిలుస్తున్నప్పటికీ.. హైదరాబాద్ హౌజ్‌ ఇలాంటి అనేక చారిత్రక పరిణామాలకు మౌన సాక్షిగా నిలిచింది

Advertisement

తాజా వార్తలు

Advertisement