Tuesday, May 7, 2024

స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాల కల్పన.. జీవీఎల్‌కు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పనకు కేంద్రప్రభుత్వం భరోసానిచ్చింది. ఈమేరకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుకు శుక్రవారం లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో భూములు ఇచ్చిన కుటుంబాలకు పునరావాస ప్యాకేజీలో భాగంగా ఉద్యోగాల కల్పనకు ఆర్‌ఐఎన్‌ఎల్ హామీ ఇచ్చింది. మిగతా కుటుంబాలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాయని, వారి ఇబ్బందుల గురించి ఎంపీ జీవీఎల్ ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య ఆర్‌ఐఎన్‌ఎల్‌తో ఉద్యోగాల కల్పనపై చర్చించామంటూ జీవీఎల్‌కు లేఖ రాశారు. 16,500 మందికి గానూ ఇప్పటివరకు 8 మేల మందికి ఉద్యోగాల కల్పన జరిగిందని తెలిపారు.

వాటితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్, ఇతర అనుభవం అవసరం లేని పోస్టులకు 50 శాతం ఉద్యోగాలను నిర్వాసితులకు ఇవ్వనున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సంబంధించిన మెయింటెనెన్స్ కాంట్రాక్టులో తీసుకోవలసిన ఉద్యోగాల్లో 50 శాతం మంది ఉద్యోగాలు కేవలం నిర్వాసితులకు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్పందన నేటికీ ఉపాధి హామీ పొందని వేలాది మంది నిర్వాసితులకు భారీ ఉపశమనమని జీవీఎల్ నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరింతగా కృషి చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement