Saturday, April 27, 2024

TS | మోదుగు పూల సంబరం… పల్లెల్లో సాంప్రదాయ రంగుల హోలీ

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : శశిర రుతువుకు వీడ్కోలు పలుకుతూ… సప్తవర్ణ శోభిత వసంతానికి స్వాగతం పలుకుతూ.. ఆనందోత్సవాల మధ్య జరుపుకునే హోలీ పండుగ పల్లెల్లో సంబరాలను తెచ్చిపెడుతోంది. వసంతకాలం రాకతోనే పల్లెలు, అడవులు దారి పొడుగునా మోదుగు పూల చెట్లతో స్వాగతం పలుకుతాయి. హోలీ పండగ మారుమూల గిరిజన గ్రామాల్లో మోదుగు పూల రంగులతో సాంప్రదాయపద్ధంగా జరుపుకోవాలని నేటికీ అనవాయతిగా వస్తోంది.

ఆదివాసీ గిరిజనులు, బంజారా తెగ మహిళలకు , సాంప్రదాయ పల్లె జనానికి మోదుగ పూలతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రకృతికి ప్రతీకగా .. అందంతోపాటు ఆహ్లాదాన్ని పంచే మోదుగ పూలకు విశేష ప్రాధాన్యత ఉంది. మోదుగ చెట్ల బెరడును ఔషధ గుణం కలిగి ఉండడంతో వివిధ వ్యాధుల నివారణకు వాడుతుంటారు. వేసవి పండుగ సీజన్లలో పల్లెల్లో మోదుగ ఆకులతోనే విస్తార్లు చేసుకొని విందులు ఆరగిస్తారు.

ఇక మోదుగ పూలు పల్లెల్లో హోలీ పండుగ కు సాంప్రదాయపద్ధంగా విరివిగా వినియోగించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆధునికత సంతరించుకున్న పట్టణాల్లో విషపూరిత రసాయనాలు తో చర్మ వ్యాధులు కొని తెచ్చే రంగులు వాడుతుంటే… మారుమూల పల్లెల్లో మాత్రం ఔషధ గుణాలు కలిగిన సాంప్రదాయ పూలతో రంగులు తయారు చేసుకోవడం నేటికీ కనిపిస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్ నార్నూర్ ,కెరమెరి, దండేపల్లి ,నేరడిగొండ, బేల మండలాల్లో ఆదివాసి గిరిజనులే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఇప్పటికీ సాంప్రదాయ మోదుగ పూలు రంగులను వాడుతుంటారు.

రంగులు తయారు చేయడం ఇలా..

ప్రతి ఊళ్లో మోదుగ చెట్లు విరివిగా లభిస్తాయి. మోదుగు పూలు , ఎర్రని గుత్తులు ప్రతి ఒక్కరిని కనువిందు చేస్తాయి. తరతరాలుగా వస్తున్న ఆచారాల మేరకు సాంప్రదాయబద్ధంగా మోదుగ పూలతో తయారయ్యే రంగులు చల్లుకుంటారు. ముందుగా తెచ్చిన మోదుగ పూలను ఆరబెట్టి, పాత్రలో నీళ్లు పోసి బాగా ఉడికించాలి. గంటసేపు ఉడికించిన తర్వాతే నారింజ రంగు కాస్త కాషాయవర్ణంగా మారిపోతుంది. ఈ రంగును పిల్లలు, పెద్దలు సహజ సిద్ధంగా చల్లుకొని సంబరాలు జరుపుకోవడం నేటికి పల్లెల్లో కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement