Friday, April 26, 2024

AP – ఎన్డీఏ కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై సుదీర్ఘంగా చర్చించారు.35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతివ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. దళితులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని చంద్రబాబును మందకృష్ణ కోరారు.తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ గెలుపుతోనే మాదిగల గెలుపు అంటూ ఆయన అన్నారు. తెలుగుదేశం విజయంలో మాదిగలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. 40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజిక వర్గం ఆదరిస్తోందన్నారు. అలాంటి మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తామన్నారు.దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ చక్కగా పోరాడుతున్నారని చంద్రబాబు కొనియాడారు.

మాదిగల ఆకాంక్షలను చంద్రబాబు ముందు పెట్టామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ప్రభుత్వం వచ్చాక మొదటి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే తొలి అసెంబ్లీ సమావేశల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. వర్గీకరణ విషయంలో జగన్ మాదిగలను మోసం చేశారని విమర్శించారు. సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ సందర్భంగా జగన్ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేటును కూడా పెట్టలేదన్నారు. మాదిగల సంక్షేమాన్ని జగన్ గాలికి వదిలేశారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని.. మాదిగలంతా నిద్రాహారాలు మాని కూటమి గెలుపు కోసం పనిచేస్తారన్నారు.

30న గుంటూరులో ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి ఇంటింటికి కూటమి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామన్నారు. కేంద్రంలో మోడీపై, రాష్ట్రంలో చంద్రబాబుపై మాకు నమ్మకం ఉందన్నారు. మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. 29 రిజర్వుడ్‌ సీట్లలో మాదిగలకు జగన్ కేవలం పది స్థానాలు మాత్రమే ఇచ్చారని.. చంద్రబాబు టీడీపీ పోటీ చేసే 24లో 14 మాదిగలకు కేటాయించారన్నారు. జనసేన పోటీ చేసే రిజర్వుడ్‌ స్థానాలు మూడింట్లో ఒకటి మాదిగలకు ఇవ్వాలని పవన్‌ను కోరుతున్నామన్నారు. గతంలో రాజ్యసభ స్థానం వర్ల రామయ్యకి చేజారింది.. ఈసారి కచ్చితంగా ఆయనకి ఇవ్వాలని కోరారు. ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపుగా భావిస్తామన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement