Saturday, April 27, 2024

ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించిన హైకోర్టు

ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్నిసార్లు ఆదేశించినా హైకోర్టు ఉత్తర్వులను వారు లెక్క చేయకపోవడంతో సహనం నశించిన హైకోర్టు చివరికి శిక్ష విధించింది. హైకోర్టు తమ ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యతల్లో ఉండి నిర్లక్ష్యం ప్రదర్శించిన చిరంజీవి చౌదరి, పూనం మాలకొండయ్యలకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈనెల 29న శిక్షను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం హర్టీకల్చర్ సెరీకల్చర్ కమిషనర్‌గా చిరంజీవి చౌదరి ఉన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య ఉన్నారు. పూనం మాలకొండయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెకు వారెంట్ జారీ చేశారు.

విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసి గతంలో నిర్దేశించిన పలు అర్హతలను తొలగించింది. దీన్ని సవాలు చేస్తూ ఎస్‌.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ అమలు చేయలేదు. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉద్దేశపూర్వకంగానే అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement