Friday, April 26, 2024

గొటబాయకు ఊరట.. 119-68 తేడాతో వీగిన అవిశ్వాసం

కొలంబో : ఆర్థిక సంక్షోభం, ప్రజాందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు గొప్ప ఊరట లభించింది. అధ్యక్ష పదవినుంచి గొటబాయ వైదొలగాలంటూ విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గొటబాయ ప్రభుతం గద్దె దిగాలంటూ ప్రజలు కూడా ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం రాజపక్సకు నైతికబలాన్ని ఇవనుంది. కొద్దిరోజుల క్రితం వాయిదా పడిన పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైనవెంటనే విపక్ష తమిళ్‌ నేషనల్‌ అలయన్స్‌ ఎంపీ ఎం.ఎ.సుమన్‌థిరన్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తక్షణం చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు.

దీనికి విపక్షాలు మద్దతు పలికాయి. రోజువారీ కార్యక్రమాలు పక్కనబెట్టి అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం కల్పించాలని కోరాయి. అయితే అధికారపక్షం ససేమిరా అంది. తీర్మానంపై అప్పటికప్పుడు ఓటింగ్‌ నిర్వహించాలని అధికారపక్షం డిమాండ్ చేసింది. ఈ ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 119, అనుకూలంగా 68 ఓట్లు వచ్చాయి. దీంతో విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ ప్రకటించారు. కాగా తీర్మానంపై చర్చకు అనుమతిస్తామని మంత్రి దినేష్‌ గుణవర్థనే ప్రకటించారు. అయితే అవిశ్వాస తీర్మానం ఓడిపోయినంత మాత్రాన గొటబాయకు కలసివచ్చేది ఏమీ లేదని, ప్రజాగ్రహానికి గురవుతున్న ఆయన మరెంతో కాలం పదవిలో ఉండలేరని మరో విపక్ష నేత ముజిబర్‌ రెహ్మాన్‌ అభిప్రాయపడ్డారు. ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టాక పార్లమెంట్‌ సమావేశాలు జరగడం ఇదే ప్రథమం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement