Tuesday, May 14, 2024

కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి.. పార్టీ బలం పెరిగిందన్న రేవంత్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ సమాజం కాంగ్రెస్‌లోకి రావాలని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రవీణ్ రెడ్డి రాకతో హుస్నాబాద్‌లో కాంగ్రెస్ మరింత బలోపేతం కానుందని సంతోషం వ్యక్తం చేశారు. వరదలు వస్తే అప్రమత్తం చేయాల్సిన సీఎం, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాడని ఎద్దేవా చేశారు. వరదలతో జనం ఇబ్బందులు పడుతుంటే రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ అత్యత నిర్లక్ష్యపూరితమైనవని, అవినీతిపై చర్చ జరగకుండా ఈ అంశాన్ని తెర పైకి తెచ్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

పోలవరాన్ని ప్రాజెక్టును సాంకేతికంగా పరిశీలించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ చెప్పింది నమ్మాలా మంత్రి అజయ్ చెప్పింది నమ్మాలా అని ప్రశ్నించారు. సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వరదల కారణంగా 11 లక్షల హెక్టర్ల పంట ధ్వంసమైందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమమాండ్ చేశారు. రాష్ట్రంలో తలెత్తిన వరద సమస్యలపై, నష్టాలపై సంపూర్ణ నివేదికను కేంద్రానికి సమర్పించాలని కోరారు. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వచ్చి కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చి సహాయ చర్యల కోసం కార్యాచరణ చేపట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి 2 వేల కోట్లు సాధించాలని సవాల్ విసిరారు. 21 నుంచి తెలంగాణలో చేపట్టనున్న బీజేపీ కార్యక్రమాలను జనం అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ప్రాణాలంటే విలువ లేని బీజేపీ రాష్ట్రంలోకి రానిస్తే మరింత ప్రమాదమని హెచ్చరించారు. తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement