Sunday, May 19, 2024

మైనింగ్‌ మాఫియాకు డీఎస్పీ బలి.. ట్రక్కుతో ఢీ కొట్టి చంపేశారు

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. మైనింగ్‌ మాఫియా చేతిలో డీఎస్పీ సురేందర్‌ సింగ్‌ గురుగావ్‌కు సమీపంలోని పచగాన్‌లో సోమవారం హత్యకు గురయ్యారు. మైనింగ్‌ మాఫియాను అడ్డుకోవడానికి తురు డీఎస్పీ సురేందర్‌ సింగ్‌ ప్రయత్నించగా, మాఫియా గ్యాంగ్‌ ఆయనను ట్రక్కుతో గుద్ది పారిపోయారు. సంఘటనాస్థలంలోనే డీఎసీ సురేందర్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది అక్టోబరులో సింగ్‌ పదవీ విరమణ చేయాల్సి ఉండగా, అక్రమ మైనింగ్‌ మాఫియా చేతిలో హత్యకు గురయ్యారు. మీవట్‌ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని సమాచారం అందడంతో, డీఎస్పీ సురేందర్‌ సింగ్‌ తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. అనుమతి లేకుండా అక్రమంగా రాళ్లను తరలిస్తున్న ట్రక్కులను అడ్డుకోవడానికి సురేందర్ సింగ్‌ ప్రయత్నించారు. లోడ్‌ తో వస్తున్న ట్రక్కుకు ఎదురుగా నిలబడి ఆపాల్సిందిగా డీఎస్పీ సింగ్‌ హెచ్చరిస్తున్నా, డ్రైవర్‌ ఖాతరు చేయకుండా, ట్రక్కును ఆయనపైకి ఎక్కించేశాడు. దీంతో, డీఎస్పీ సింగ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పక్కకు తప్పుకున్న పోలీసులు ప్రాణాలతో బైట పడ్డారు.

అక్రమ మైనింగ్‌పై సెర్చ్‌ ఆపరేషన్‌ను ఎస్పీ, ఐజీ పర్యవేక్షణలో డీఎస్పీ సురేందర్‌ సింగ్‌ నిర్వహించారు. డీఎస్పీ హత్యను హర్యానా పోలీస్‌ శాఖ తీవ్రంగా ఖండించింది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని ట్విట్టర్‌ వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. డీఎస్పీ హత్యను సీఎం ఖత్తార్‌ తీవ్రంగా కండించారు. ఈ హత్యలో ఒకటి కంటే ఎక్కువ ట్రక్కులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్‌ వర్గాల సమాచారం ప్రకారం, హర్యానా సీఎం ఖత్తార్‌ రాష్ట్ర డీజీపీకి ఫోన్‌ చేసి హత్య జరిగిన సంఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ స్పందించారు. డీఎస్పీ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. కేసు విచారణ శీఘ్రంగా జరిపేందుకు ఎక్కువ సంఖ్యలో అధికారులను నియమించడం జరుగుతుందని, అవసరమైతే, ఇతర జిల్లాల నుంచి అధికారులను తీసుకోవడం జరుగుతుందని హోంశాఖ మంత్రి ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement