Tuesday, May 14, 2024

River linking | నదుల అనుసంధానంపై సిద్ధమైన ఫైనల్‌ డ్రాప్ట్.. నెలాఖరులో ఎన్‌డబ్ల్యుడీఏ కీలక భేటీ

అమరావతి, ఆంధ్రప్రభ : గోదావరి-కావేరి అనుసంధానంపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలనే కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరె శ్రీరామ్‌ అధ్యక్షతన భాగస్వామ్య రాష్ట్రాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించగా ఈ నెలాఖరులో ఢిల్లీలో మరో భేటీకి ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నదుల అనుసంధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఛత్తీస్‌ఘడ్‌ను ఒప్పించేందుకు ఈ భేటీని ప్రధాన వేదికగా ఉపయోగించుకోవటంతో పాటు భాగస్వామ్య రాష్ట్రాలకు ఫైనల్‌ డ్రాప్ట్‌ను అందించనున్నట్టు సమాచారం.

ఈ మేరకు దేశంలో నదుల అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న జాతీయ జలవనరుల అబివృద్ధి సంస్థ (ఎన్‌ డబ్ల్యుడీఏ) ఫైనల్‌ డ్రాప్ట్‌ను సిద్ధం చేసింది. గోదావరి నుంచి కావేరికి నదీ జలాలను తరలించే అంశంలో వేర్వేరుగా అందిన భాగస్వామ్య రాష్ట్రాల ప్రతిపాదనలను పరిశీలించిన ఎన్‌ డబ్ల్యుడీఏ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఈ మేరకు ఫైనల్‌ డ్రాప్ట్‌nను సిద్ధం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కూడా రూపొందించింది.

డీపీఆర్‌ ముసాయిదాను గతంలోనే భాగస్వామ్య రాష్ట్రాల ముందుంచిన ఎన్‌డబ్ల్యూడీఏ ఈ నెలాఖరులో నిర్వహించనున్న కీలక సమావేశంలో ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఏకాభిప్రాయం రాకున్నా ఇదే డీపీఆర్‌ను వీలైనంత తొందరలో ఆచరణలో పెట్టేందుకు అవసరమైన సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కూడా చర్చిస్తోంది.

రూ 39 వేల కోట్ల వ్యయం

- Advertisement -

గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధానం కోసం రూ 39,274.92 కోట్ల వ్యయమవుతుందని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రాథమిక అంచనా. గోదావరి నుంచి కృష్ణా, పెన్నాల మీదుగా కావేరికి నీళ్లు తీసుకెళ్ళేందుకు మొత్తం 1211 కిలోమీటర్ల పొడవున పనులు చేపట్టాల్సి ఉంటుందని డీపీఆర్‌లో ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించింది. దీనిలో 299 కిలోమీటర్ల మేర ఉండే గోదావరి-కృష్ణా అనుసంధానానికి రూ.14,765.69 కోట్లు, 393 కిలోమీటర్ల వరకు ఉండే కృష్ణా-పెన్నాకు రూ 9893.05 కోట్లు, 519 కిలోమీటర్లు ఉండే పెన్నా-కావేరి లింక్‌ కోసం రూ 14,616.18 కోట్లు.. మొత్తం రూ 39,274.92 కోట్లు అవసరమవుతాయని ఎన్‌డబ్ల్యుడీఏ అంచనాలు రూపొందించింది.

చత్తీస్‌ఘడ్‌ నుంచి కేటాయింపులు

గోదావరి-కావేరి అనుసంధానానికి గోదావరిలో చత్తీస్‌ఘడ్‌ వాటాగా ఉన్న జలాలను వినియోగించుకోవాలని ఎన్‌డబ్ల్యుడీఏ తుది నిర్ణయం తీసుకుని డీపీఆర్‌లో కూడా పొందుపర్చింది. గోదావరిలో చత్తీస్‌ఘడ్‌కు 283 టీఎంసీల వాటా ఉంది. సాంకేతిక కారణాల వల్ల కేటాయింపు జలాల్లో 141 టీఎంసీలను ఆ రాష్ట్రం వినియోగించుకోలేకపోతుంది. గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసిన నేపథ్యంలో చత్తీస్‌ఘడ్‌ వినియోగించుకోని 141 టీఎంసీలను గోదావరి-కావేరి అనుసంధానానికి కేటాయించటం ద్వారా భాగస్వామ్య రాష్ట్రాల అభ్యంతరాలకు ముగింపు పలకవచ్చని ఎన్‌ డబ్ల్యూడీఏ భావిస్తోంది.

141 టీఎంసీల్లో ఏపీకి 41.8 టీ-ఎంసీలు, తెలంగాణకు 42.6 టీఎంసీలు, తమిళనాడుకు 38.6 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీ-ఎంసీలు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించేలా ఫైనల్‌ డ్రాప్ట్‌ సిద్ధమైంది. దీనికి చత్తీస్‌ఘడ్‌ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిలో తమ వాటా నీళ్ళను అనుసంధానానికి కేటాయించటం అసంబద్ధం.. గోదావరి నీళ్ళను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవసరమైన వనరులు సమకూర్చుకుంటున్న దశలో అనుసంధానం కోసం తరలించుకుపోవటంపై ప్రశ్నిస్తామనీ, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చత్తీస్‌ఘడ్‌ అంటోంది.

ఏపీలో కొత్త ఆయకట్టు

గోదావరి-కావేరి అనుసంధానం కార్యరూపం దాలిస్తే ఏపీకి కొత్త ఆయకట్టు ఏర్పడనుంది. రాష్ట్రానికి కేటాయించే 41.8 టీఎంసీల్లో 31.39 టీఎంసీలను వ్యవసాయ అవసరాలకూ, మిగిలిన టీఎంసీలను తాగునీరు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. 31.39 టీఎంసీలను సాగుకోసం కేటాయించటం ద్వారా ఏపీలో 2,19,271 హెక్టార్ల కొత్త ఆయకట్టు ఏర్పడనుందని ఎన్‌ డబ్ల్యుడీఏ చెబుతోంది.

తెలంగాణలోనూ 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుతో పాటు 1,58,236 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ ఏర్పడుతుంది.. అదే విధంగా కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనూ కొత్త ఆయకట్టుతో పాటు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని ఎన్‌ డబ్ల్యూడీఏ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement