Thursday, May 2, 2024

దిగొస్తున్న స్టీల్‌ ధరలు.. ఆరు నెలల్లో 40శాతం తగ్గుదల

దేశీయ విపణిలో స్టీల్‌ ధరలు దిగొస్తున్నాయి. గత ఆరు నెలల్లో దాదాపు 40శాతం తగ్గాయి. ప్రస్తుతం స్టీల్‌ ధరలు టన్నుకు రూ.57000కు చేరినట్లు స్టీల్‌మింట్‌ తెలిపింది. ఇది నిర్మాణ రంగానికి ప్రోత్సాహకరమైన సూచనగా పేర్కొంది. స్టీల్‌ ఎగుమతులపై 15శాతం సుంకం విధించడంతో విదేశీ ఆర్డర్లు వేగంగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో దేశీయ డిమాండ్‌ సాధారణంగా ఉండటంతో ఉక్కు ధరలు వేగంగా దిగొచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో హాట్‌ రోల్డ్‌ కాయిల్‌ ధరలు పెరగడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. స్థిరాస్తి, నిర్మాణం, మౌలిక వసతులు, ఆటోమొబైల్‌, వినియోగ వస్తువుల రంగాలపై స్టీల్‌ ధరలు ప్రత్యక్ష ప్రభావం చూపాయి. 2022 మొదటి త్రైమాసికం ఆరంభంలో టన్ను స్టీల్‌ ధర రూ.78,800గా ఉంది. 18శాతం జీఎస్టీతో ఇది రూ.93000 వద్ద గరిష్టాన్ని చేరింది.

ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై సుంకాలు పెంచింది. మే 21న ఇనుప ఖనిజం ఎగుమతులపై 50శాతం, ఇతర స్టీల్‌ ఉత్పత్తులపై 15శాతం సుంకం విధించింది. అలాగే స్టీల్‌ పరిశ్రమలో ఉపయోగించే కోకింగ్‌కోల్‌, ఫెర్రోనికెల్‌ దిగుమతులపైనా పన్నులు విధించింది. దాంతో అప్పటి నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. జూన్‌ చివరి నాటికి టన్నుధర రూ.60,200కి దిగొచ్చింది. సెప్టెంబర్‌ నాటికి అది మరింత తగ్గి రూ.57000కు చేరింది. వచ్చే త్రైమాసికంలోనూ ధరలు పరిమిత శ్రేణిలోనే కదలాడే అవకాశం ఉందని స్టీల్‌మింట్‌ అంచనా వేసింది. విదేశీ ఆర్డర్లు మరో రెండు నెలల పాటు పెద్దగా పుంజుకునే అవకాశం లేదని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement