Friday, April 26, 2024

డాక్టర్లకు డ్రెస్‌కోడ్‌.. స్కర్టులు, జీన్సులు, మేకప్‌లకు నో పర్మిషన్‌

హర్యాణా ప్రభుత్వం వైద్య సిబ్బందికి డ్రెస్‌కోడ్‌ నిబంధనల్ని తీసుకొచ్చింది. ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది ఇకపై ఫంకీ హెయిర్‌స్టయిల్‌, భారీనగలు, మేకప్‌ వేసుకుని విధులకు రావడాన్ని అనుమతించబోమని స్పష్టంచేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఏకత్వం, సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డ్రెస్‌కోడ్‌ పాలసీ రూపొందించినట్లు ఆరోగ్యమంత్రి అనిల్‌ విజ్‌ వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు ముఖ్యంగా, ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది పనివేళల్లో విచిత్రమైన హెయిర్‌స్టైళ్లు, భారీ నగలు, మేకప్‌, పొడవాటి గోళ్లు, స్కర్టులు ధరించడాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అదేవిధంగా, పురుషుల విషయంలో అసాధారణ హెయిల్‌ స్టయిల్స్‌, మోడర్న్‌ హెయిర్‌ కట్‌లపై ఆంక్షలు విధించింది.

గోళ్లు శుభ్రంగా ఉండాలని సూచించింది. టీషర్టులు, జీన్స్‌లు, స్కర్టులు, లెదర్‌ ప్యాంట్లు, క్రాప్‌టాప్‌లు వంటి దుస్తులు ప్రొఫెషనల్‌లా కన్పించవు. అందువల్ల వాటిని అనుమతించ కూడదని నిర్ణయించాం. ప్రొఫెషనల్‌గా కనిపించే ఫార్మల్‌ దుస్తులనే ధరించాలి. నర్సింగ్‌ క్యాడర్‌ మినహా ట్రైనీలు తప్పని సరిగా నల్ల ప్యాంట్‌, తెల్లషర్ట్‌ ధరించాలి అని కొత్త నిబంధనల గురించి అనిల్‌విజ్‌ వివరించారు. నైట్‌ షిఫ్టులలో కూడా సిబ్బంది డ్రెస్‌కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement