Saturday, May 4, 2024

టీబీ రోగులకు మరింత చేయూత.. ఉచిత వైద్య సేవలతోపాటు పౌష్టికాహారం పంపిణీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీబీ రోగులకు ఉచిత వ్యాధి నిర్ధారణా పరీక్షలు, మందులు, పోషణా భత్యం ప్రతినెలా రూ.500తోపాటు అదనంగా బియ్యం, పప్పులు, నూనె తదితర పదార్థాలను అందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర టీబీ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డా. ఎ. రాజేశం తెలిపారు. పౌష్టికాహారంతోపాటు వృత్థిపరమైన శిక్షణ, ఇతర రోగ నిర్ధారణా పరీక్షలు తదితర సేవలను కూడా ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ సహాయాన్ని ఒక సంవత్సరంపాటు అందిస్తామన్నారు. అయితే ఈ సహాయం పొందగోరు టీబీరోగులు ముందుగానే వారి అంగీకారాన్ని సమ్మతిని టీబీ కార్యక్రమ అధికారులకు అందించాల్సి ఉంటుందన్నారు. సహాయం కావాలంటూ ఆన్‌లైన్‌ ద్వారా గాని లేదా నేరుగా అంగీకారపత్రంపై సంతకం చేసి టీబీ కార్యక్రమ అధికారులకు అందించొచ్చని తెలిపారు. అంగీకార పత్రాన్ని సమర్పించిన వారికే వైద్య, ఆహార సహాయాన్ని కొనసాగిస్తామన్నారు.

మరిన్ని వివరాలకు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి టీబీ ఆరోగ్య సాథి యాప్‌ను మొబైల్‌లో పొందుపర్చుకోవచ్చన్నారు. టీబీ రోగులకు అందిస్తున్న ఈ ప్రత్యేక సహాయ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఔత్సాహిక దాతలు, స్వచ్ఛంధ సంస్థలు, పారిశ్రామిక సంస్థలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో లేదా టీబీ యూనిట్‌ స్థాయిలో టీబీ రోగులకు సంస్థలు లేదా దాతలు సేవలు అందించేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. టీబీ నిర్మూలనా కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ క్రియాశీల పాత్ర పోషించేవిధంగా చేయడం ద్వారా 2025 నాటికి భారతదేశం టీబీ రహిత దేశంగా మార్చాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని పేర్కొన్నారు. దేశాన్ని టీబీ రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నాయన్నారు. తాజాగా టీబీ నిర్మూలనా కార్యక్రమం కింద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు, అదనపు సహాయం అందించాలని ప్రభుత్వాలు నిర్ణయించినట్లు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement