Monday, April 29, 2024

ట్రిబ్యునల్‌ తీర్పులకు లోబడే జలాశయాలు రూల్‌ కర్వ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ట్రిబ్యునల్‌ తీర్పులకు లోబడే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి ఆయా నెలల్లో నీటి విడుదల, నీటి మట్టాల నియంత్రణ (రూల్‌ కర్వ్‌) అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఏర్పాటు చేసిన జలాశయాల పర్యవేక్షణా కమిటీ సమావేశం చర్చించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షణ కమిటీ రెండో సమావేశం హైదరాబాద్‌లోని జలసౌదలో సోమవారం జరిగింది. గత కేఆర్‌ఎంబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ను ఏజెండాలో చేర్చి చర్చించారు. కేంద్ర జల సంఘం సంచాలకులు రిషి శ్రీవాస్తవ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రూల్‌ కర్వ్‌ అంశంపై సమావేశంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల రూలకర్వ్‌, జలవిద్యుదుత్పత్తి, వరద సమయంలో నీటి లెక్కింపు సహా సంబంధిత అంశాల విధివిధానాలపై చర్చించారు.

జూన్‌ 1 నుంచి నీటి సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జలవిద్యుదుత్పత్తిపై జాతీయ సమగ్రత దృష్ట్యా రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూల్‌ కర్వ్‌ ఉండనున్నట్లు బోర్డు సమావేశంలో తేల్చి చెప్పినట్లు సమాచారం. తాగు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా జల విద్యుదుత్పత్తిపై నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ కోరినట్లు సమాచారం. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాలకు అనుకూలంగా రూల్‌ కర్వ్‌ ఉండాలని సమావేశం నిర్ణయించింది. రూల్‌ కర్వ్‌ ముసాయిదాపై ఏపీ అధికారులు కొన్ని వివరణలు అడిగినట్లు తెలిసింది. జల విద్యుదుత్పత్తి, వరద సమయంలో నీటి లెక్కింపునకు సంబంధించి కూడా సమావేశంలో చర్చించారు. ముసాయిదా అభిప్రాయాలనుతెలంగాణకు పంపించి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటామని కమిటీ కన్వీనర్‌ పిళ్లై చెప్పినట్లు సమాచారం. జూన్‌ మొదటి వారంలో కమిటీ మరోమారు సమావేశం కానుంది. ఆ సమావేశంలో రూల్‌ కర్వ్‌, జల విద్యుదుత్పత్తి, నీటి విడుదల ఈ మూడు అంశాలపై నివేదికను కేఆర్‌ఎంబీ, కేంద్ర జలశక్తిశాఖకు సమర్పించనున్నట్లు బోర్డు అధికారులు సమావేశానికి తెలిపారు.

మరోసారి తెలంగాణ అధికారుల గైర్హాజరు..

సమావేశానికి తెలంగాణ అధికారులు మరోసారి గైర్హాజరయ్యారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో ప్రీమాన్‌సూన్‌ ప్రణాళిక కార్యక్రమంలో నిమగ్నమైనందున సమావేశానికి రాలేకపోతున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఈ విషయమై ఈఎన్‌సీ మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు మొదటి సమావేశంలోనూ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొనలేదు. జూన్‌ 15 తర్వాత నిర్వహించే రివర్‌ మేనేజ్‌మెెంట్‌ బోర్డు సమావేశాలకు హాజరవుతామని తెలంగాణ కేఆర్‌ఎంబీకి స్పష్టం చేసింది. ఏపీ నుంచి ఆ రాష్ట్ర ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement