Monday, May 6, 2024

ఢిల్లీలో గాలివాన బీభత్సం.. ఏపీ, తెలంగాణా భవన్లలో విరిగిపడ్డ చెట్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం హఠాత్తుగా సంభవించిన ఈదురుగాలులు, వర్షంతో ఆంధ్రప్రదేశ్-తెలంగాణా భవన్‌లోని వందేళ్ల నాటి వృక్షాలతో పాటు భారీ కొమ్మలు విరిగిపడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బిల్డింగుకు ఉన్న పెద్ద పెద్ద అద్దాలు ఈదురుగాలుల ధాటికి అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా పగిలి టీటీడీ వారి వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రాంగణంలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన అద్దాలు తగిలి ముఖేష్ అనే వ్యక్తి మెడపై గాయాలయ్యాయి. పలు పక్షులూ గాలి దుమ్ము, వాన ధాటికి ప్రాణాలు కోల్పోయాయి. వాన వెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, తెలంగాణా భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తమ సిబ్బందితో భవన్ పరిసరాలను పరిశీలించారు. ప్రవీణ్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ… ఢిల్లీలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. దెబ్బతిన్న భవనాలను త్వరలోనే మరమ్మత్తులు చేయిస్తామని తెలిపారు. పాత భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తామని వెల్లడించారు. యుద్ధ ప్రాతిపదికన భవన్‌లో మరమ్మత్తులు జరిపి వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితి నెలకొనేలా చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మరోవైపు ఈదురుగాలుల దెబ్బకు రోడ్డు, రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై చెట్లు, ఫ్లెక్సీలు విరిగిపడిపోవడంతో నగరమంతటా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్థంభించింది. ఢిల్లీవాసి ఇంటికి చేరుకోవడానికి గంటల కొద్దీ ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement