Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో అర్బన్‌ ఫారెస్టు.. మియావాకీ పేరుతో డెవలప్​మెంట్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దక్షిణ మధ్య రైల్వే తన నిరంతర ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేసింది. రైల్వే అంటే కేవలం ప్రయాణికుల రవాణా, లేదా సరుకు రవాణానే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం తనవంతు కృషి చేస్తోంది. గత కొంత కాలంగా దేశంలోని ప్రధాన నగరాల్లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ తదితర వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌ నగరం కూడా కాలుష్యంలో అగ్రస్థానంలోనే ఉంటోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకానికి అగ్రస్థానం వేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదవ విడత హరితహారం కార్యక్రమం కింద 19.54 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 20.06 కోట్ల మొక్కలు నాటి ఎనిమిదవ విడత టార్గెట్‌ను పూర్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి ఆకర్షితులవుతున్న దమ రైల్వే అధికార వర్గాలు మేము సైతం అన్నట్టు భారీగా మొక్కలను నాటడమే కాకుండా వారి పరిరక్షణకు బాధ్యతలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు నిజామాబాద్‌, గద్వాల రైల్వే స్టేషన్‌ ప్రాంగణాల్లో దాదాపు 2300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 8500 మొక్కలతో మియావాకీ ప్లాంటేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే పూర్తి చేసింది.

ఇదే క్రమలో మారుమూల ప్రాంతాలే కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను హరితహారం కోసంం వేదికగా చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువుగా ఉంటున్న సికింద్రాబాద్‌ ప్రాంతాన్ని కాలుష్య రహత నగరంగా చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో నార్త్‌ లాలాగూడలోని శాంతి నగర్‌ రైల్వే కాలనీని ఎంచుకున్న దమ రైల్వే శాఖ సుమారు 4300 చదరపు మీటర్ల స్థలంలో మీయావాకీ పేరుతో ప్లాంటేషన్‌ పనులను పూర్తి చేసింది. మరో 1100 చదరపు మీటర్ల పని పురోగతిలో ఉంది. పట్టణ ప్రజలు గాలి పీల్చుకోలేక ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతోనే ఇక్కడ మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు దమ రైల్వే చెబుతోంది. లాలాగూడ శాంతినగర్‌ రైల్వే కాలనీలో మొక్కల పెంపకాన్ని దశల వారీగా నిర్వహిస్తూ సంరక్షణ బాధ్యతలను చూసుకుంటోంది.

అంతే కాదు రానున్న రోజుల్లో మరింత విస్తరించి శాంతినగర్‌ కాలనీలో 20 వేల మొక్కలతో 5400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మియావాకీ ప్లాంటేషన్‌ను విస్తరించనున్నామని దమ రైల్వే చెబుతోంది. కాగా ఈ ప్రాజెక్టు ‘ సే ట్రస్టు ఎన్విరాన్‌మెంటల్‌ ట్రస్టు ‘ అనే స్వచ్చంద సంస్థ కూడా సహకారం అందిస్తోందని చెబుతోంది.

ఏమిటీ ‘ మీయావాకీ ‘ ??

- Advertisement -

మియావాకీ అనేది దట్టమైన బహుళ జాతుల మొక్కలతో కూడిన పట్టణ అటవీ ప్రాంతం. ఇది పర్యావరణ ( ఎకలాజికల్‌ ) ఇంజనీరింగ్‌, ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరిత గతిన పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. ఈ విధానంలో విభిన్నజాతుల మొక్కలను నాటుతున్నారు. మొక్కల ఎదుగుదల కూడా సాధారణ మొక్కల పెరుగుదల కంటే కూడా పది రెట్లు వేగంగా అధికంగా ఉంటోంది. రెండేళ్ల తర్వాత అవి స్వయం సమృద్ధిని సంతరించుకునే మొక్కలు కావడం విశేషం. ఈ విధానంలో మొక్కలు వంద శాతం జీవించే అవకాశాలు ఉంటాయని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొక్కలు సూర్యరశ్మి యుెెక్క పైభాగం నుండి సంగ్రహిస్తూ పక్కలకు విస్తరించకుండా సొడుగ్గా పైకి పెరుగుతాయి. 50-55 రకాల స్థానిక జాతులు పండ్లు ఔషధ మొక్కలు, పూల జాతి మొక్కలే కాకుండా కలప జాతి తదితర మొక్కలను ఎంపిక చేసి లాలాగూడ శాంతినగర్‌లో అభివృద్ధి చేయిస్తున్నారు.

కాగా మొక్కలను నాటడమే కాదు వాటి సంరక్షణ కూడా ఎంతో ముఖ్యమని దక్షిణ మధ్య రైల్వే జిఎం (ఇంఛార్జీ) అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ పరిరోణ కోసం వివిధ ప్రాంగణాలలోని ఖాళీ స్థలాలను మొక్కల పరిరక్షణ కోసం విస్త్రృతంగా వినియోగించుకుంటామని ఆయన అన్నారు. లాలాగూడలో చేపట్టిన మొక్కల పెంపకం పట్ల ఆయన హైదరాబాద్‌ డివిజన్‌ బృందాన్ని అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంతాల్లో మొక్కలు నాటాలని పిలుపు నిస్తున్నారు. మొక్కలు నాటడం అలాగే వాటిని సంరక్షించడం ఎంతో కీలకమని చెబుతున్నారు. మొక్కల పెంపకం ద్వారానే పచ్చదనం సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు వీలుపడుతుందన్న అభిప్రాయాన్ని అరుణ్‌ కుమార్‌ జైన్‌ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement