Saturday, April 27, 2024

విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయండి.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంను దేశంలోనే ప్రధాన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హబ్‌గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసిన జీవీఎల్, ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఐటీ అభివృద్ధికి ఈ నగరంలో విస్తృతావకాశాలున్నాయని తెలిపారు. ఈ క్రమంలో హబ్‌గా మార్చేందుకు అవసరమైన మౌలిక వసతులు, వ్యవస్థ, వేగవంతంగా ఐటీ ప్రాజెక్టుల అనుమతుల మంజూరు వంటి చర్యల ద్వారా కేంద్ర మంత్రిత్వశాఖ సహకరించాలని ఆయన కోరారు. అలాగే హబ్‌గా అభివృద్ధి పరిచే క్రమంలో స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు మెరుగైన ఇంక్యుబేషన్ సేవలను అందించడం కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలతో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) విశాఖపట్నం సెంటర్ కార్యకలాపాలను విస్తరించాలన్నారు.

దీంతో పాటు ప్రభుత్వ రంగ, ఇతర తయారీ రంగ కంపెనీల కోసం వినూత్న ఉత్పత్తుల ఆవిష్కరణల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. సాంకేతికత పరిజ్ఞానం, డిజిటల్ ఫాబ్రికేషన్‌ను ఉపయోగించి సరికొత్త ఆవిష్కరణల ద్వారా విశాఖ ప్రజల జీవనోపాధిని, జీవన సౌకర్యాలను మెరుగుపరచడం కోసం ఫ్యాబ్రికేషన్ లాబొరేటరీ (ఫ్యాబ్లాబ్) ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే నగరంలో ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్’ (సీ-డాక్) కేంద్రం ఏర్పాటు చేయాలని, ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాలతో సహా నాన్-మెట్రో నగరాల్లో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి బీపీవో ప్రోత్సాహక పథకాన్ని అమలు చేయాలని కోరారు. సమావేశం అనంతరం ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ… కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చాలా సానుకూలంగా స్పందించారని, విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement