Sunday, May 19, 2024

Delhi | ఎవ‌రికి ఎవ‌రు బి టీమ్…రాహుల్ గాంధీపై మండిప‌డ్డ కిష‌న్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లలో ఎవరికి ఓటేసినా ఒకటేనని, ఒకదానికొకటి బీ-టీమ్ అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. దమ్ముంటే తనతో చర్చకు రావాల్సిందిగా రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లేదా ఢిల్లీ.. ఎక్కడైనా సరే తాను చర్చకు సిద్ధమని చెప్పారు. ఎవరు ఎవరికి బీ-టీమ్ అన్నది బహిరంగ చర్చలోనే తేల్చేద్దామంటూ వ్యాఖ్యానించారు. తేదీ, సమయం నిర్ణయించి చెప్పాలని అన్నారు. పదేళ్లు అధికారానికి దూరమయ్యేసరికి రాహుల్ గాంధీకి మతిమరుపు వచ్చినట్టుందని, అందుకే నాటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య కొనసాగిన బంధం మర్చిపోయినట్టున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

“2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో భాగం పంచుకోలేదా? ఇది రాహుల్ గాంధీకి గుర్తులేదా? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా?” అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత, నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేయలేదా అని అడిగారు. కనీస రాజకీయ అవగాహన లేకుండా అబద్ధాలే పునాదులుగా మోసపూరితంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

2014లో కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరలేదా అని ప్రశ్నించారు. ప్రజలు ఎవరికి ఓటేస్తే ఎవరికి లబ్ది జరిగింది అంటూ నిలదీశారు. 2018లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మొత్తం 12 మంది బీఆర్ఎస్‌లో చేరిపోయి, లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రజలు కాంగ్రెస్‌కి ఓటేస్తే బీఆర్ఎస్ కి ఓటేసినట్టే అని గ్రహించారని కిషన్ రెడ్డి అన్నారు. 2013లో నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న మాట నిజమా కాదా అని ప్రశ్నించారు.

- Advertisement -

“రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉందా లేదా? అది ఎందుకు తొక్కిపెట్టారు? ఎవరు ఎవరిని కాపాడుతున్నారు? ఎందుకు కాపాడుతున్నారు?” అంటూ.. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసని, అన్ని విషయాల్లో మజ్లిస్ పార్టీని మధ్యవర్తిగా పెట్టుకుని మూడు పార్టీలు నాటకం ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్.. మూడు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరికి ఎవరు బీ-టీమ్ అన్నది తేల్చేందుకు చర్చకు సిద్ధమా అంటూ రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలి

1960లో ‘జై తెలంగాణ’ అని నినదించిన విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిందని, తెలంగాణ ఏర్పాటుకు ముందు 1200 మంది బలిదానాలు చేసుకున్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్నారని, కానీ తెలంగాణ ఉద్యమకారుల ప్రాణాలు బలిగొన్నందుకు ఓట్లు అడిగే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో ముక్కు నేలకు రాసి ముందు క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ముందు మీకే చెబుతాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను ఎప్పుడు విడుదల చేస్తారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిస్తూ.. జాబితా సిద్ధం కాగానే ముందు మీకే (మీడియా)కు చెబుతామనంటూ సమాధానం దాటవేశారు. పార్టీ జాతీయాధ్యక్షుణ్ణి కలిసి అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఢిల్లీలో మొదలుపెట్టనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుందని, ఆ భేటీలో అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేయనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేయడం గురించి ప్రశ్నించగా.. అది పార్టీ అంతర్గత వ్యవహారం అని సమాధానం దాటవేశారు.

ఆయన పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించగా.. సస్పెన్షన్ ఎత్తేస్తే పోటీ చేస్తారని, నిర్ణయం తీసుకున్నాక మీడియాకే ముందు చెబుతామని వెల్లడించారు. అంతకంటే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సందర్శించుకున్న రామప్ప దేవాలయం గురించి కూడా కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి ఆలయమని, అందుకు ప్రధాని మోదీకి రాహుల్, ప్రియాంక ఇద్దరూ కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. రూ. 100 కోట్లతో కేంద్ర ప్రభుత్వం అక్కడ అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తుచేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement