Sunday, May 5, 2024

Business: అమెరికాలో ఇండియన్‌ టెక్‌ కంపెనీల హవా.. 2 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన

అమెరికాలో ఇండియన్‌ టెక్నాలజీ కంపెనీలు డైరెక్ట్‌గా 2,07,000 ఉద్యోగాలను కల్పించాయి. దేశ ఆర్ధిక వ్యవస్థకు నేరుగా 103 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అందించాయి. 2017 నుంచి చూస్తే ఉద్యోగాల కల్పనలో 22 శాతం వృద్ధి సాధించినట్లు నాస్కామ్‌ విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. అమెరికాలో ఈ కంపెనీలు స్థానిక యువతలో నైపుణ్యాల పెంపుకు ఖర్చు చేస్తున్నాయని తెలిపింది. టెక్నాలజీ కంపెనీలకు కావాల్సిన నిపుణులైన ఉద్యోగులు మార్కెట్‌లో తగినంతగా లభించడంలేదని నివేదిక తెలిపింది.

అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ఇండియన్‌ టెక్నాలజీ కంపెనీల ప్రభావం అన్న పేరుతో నాస్కామ్‌ ఈ నివేదికను విడుదల చేసింది.
ఇండియన్‌ టెక్నాలజీ కంపెనీలు, ఆ కంపెనీల క్లైయింట్లు కలిపి అమెరికా అర్ధిక వ్యవస్థకు 396 బిలియన్‌ డాలర్ల సంపదను అందించారని తెలిపింది. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా 198 బిలియన్‌ డాలర్ల సంపదను సృష్టించాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ మొత్తం 2021లో 20 అమెరికా రాష్ట్రాల సంపదతో సమానం. ఇండియన్‌ టెక్నాలజీ కంపెనీలు అనేక రకాలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు వృద్ధిలో పాలుపంచుకుంటున్నాయని నాస్కామ్‌ అధ్యక్షుడు దేబ్‌జానీ ఘోష్‌ పేర్కొన్నారు. ఈ కంపెనీలు స్థానికంగా పెట్టుబడులు పెడుతున్నాయని, యువతలో నైపుణ్యాల వృద్ధికి కృషి చేస్తున్నాయని, కొత్త అంశాలను
కనుగొనడంలోనూ సహకరిస్తున్నాయని చెప్పారు.

అమెరికాలో డిమాండ్‌కు తగిన విధంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగుల అభ్యత చాలా తక్కువగా ఉంది. ఇండియన్‌ టెక్‌ కంపెనీలు ఫార్చ్యున్‌ 500 కంపెనీల్లో 75 శాతం వాటితో పని చేస్తున్నాయని నాస్కామ్‌ తెలిపింది. వీటి లో ఎక్కువ కంపెనీలు అమెరికాలోనే ప్రధాన కార్యాలయాలు కలగి ఉన్నాయని, దీని వల్ల ఆయా కంపెనీల అవసరాలుకు అనుగుణంగా టెక్‌ కంపెనీలు సర్వీసులను అందిస్తున్నాయని పేర్కొంది. ఇండియన్‌ కంపెనీలు పరిశ్రమకు కావాల్సిన ఉత్పత్తులను అందించేందుకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికాలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్ (ఎస్‌టీఇఎం)పై ఇండియన్‌ టెక్నాలజీ కంపెనీలు 1.1 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టాయి. స్థానికంగానే టాలెంట్‌ను ప్రోత్సహించడం ద్వారా వర్క్‌ వీసాలపై ఆధారపడటం తగ్గించాలని ఈ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030 నాటికి ఎస్‌టీఇఎం 51 శాతానికి చేరుకుంటుందని నాస్కామ్‌ అంచనా వేసింది. 2021లో అమెరికాలో ప్రకటించిన ప్రతి ఆరు జాబ్స్‌లో ఒక్కరే కంప్యూటర్‌, మాథ్యమెటిక్స్‌ అనుభవం ఉన్న ఉద్యోగి లభించారని, అదే 2022లో నాటికి అది 11కు పెరిగిందని తెలిపింది. హెచ్‌1బి అప్లికేషన్స్‌లో మూడో అతి పెద్ద సంఖ్య రిటైల్‌ సెక్టర్‌, ఇ-కామర్స్‌ , అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీ రంగంలో పని చేసే వారే ఉన్నారని తెలిపింది. అమెరికాలో టాలెంట్‌ను పెంచేందుకు భారత్‌ కంపెనీలు చేస్తున్న కృషి అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటును అందిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement