Tuesday, May 7, 2024

Business: 4, 389 కోట్ల దిగుమతి సుంకాలు ఎగవేసి న ఒప్పో.. లోపాలు కనిపెట్టిన డీఆర్‌ఐ

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పో 4389 కోట్ల రూపాయల దిగుమతి సుంకాలు ఎగవేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. దిగుమతుల విషయంలో ఈ కంపెనీ తప్పుడు లెక్కలు చూపించినట్లు రెవెన్యూ ఇంటలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) అధికారులు గుర్తించినట్లు తెలిపింది. మన దేశంలో ఈ కంపెనీ ఒప్పో, వన్‌ ప్లస్‌, రియల్‌ మీ పేరుతో మొబైల్‌ పోన్లను విక్రయిస్తోంది. చైనాకు చెందిన గాంగ్‌డాంగ్‌ ఒప్పో మొబైల్‌ టెలికమ్యూనికేషన్స్‌ కార్పోరేషన్‌కు అనుబంధంగా ఉన్న ఒప్పో మొబైల్స్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ కార్యాలయాల్లో అధికారులు తనిఖీ చేసినప్పుడు కస్టమ్స్‌ డ్యూటీ ఎగవేత గురించి తెలిసింది. మన దేశంలో ఈ కంపెనీ సెల్‌ ఫోన్ల తయారీ, అసెంబ్లి, హోల్‌ సేల్స్‌ బిజినెస్‌, మొబైల్స్‌ పంపిణీ, యాక్సెస్‌రిస్‌ బిజినెస్‌ చేస్తోంది. దేశంలో పలు చోట్ల ఒప్పో కార్యాలయాలు, కీలక పదవుల్లో ఉన్న మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తుల నివాసాల్లో సోదాలు చేసిన సమయంలో పలు కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులకు ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి.

మొబైల్‌ ఫోన్ల తయారీ కోసం మాతృ సంస్థ నుంచి చేసుకున్న కొన్ని దిగుమతుల విషయంలో ఒప్పో ఇండియా వాస్తవాలను దాచిపెట్టిందని ఆర్ధిక శాఖ తెలిపింది. తప్పుడు డిక్లరేషన్ల వల్ల ఒప్పోకు 2,981 కోట్ల రూపాయలు పన్నుల్లో మినహాయింపు లభించినట్లు పేర్కొంది. దిగుమతి చేసుకున్న వస్తువుల విలులో ఆ కంపెనీ చెల్లించిన రాయల్టి, లైసెన్స్‌ ఫీజుల వివరాలు పేర్కొనలేదు. ఇలా చేయడం ద్వారా కంపెనీ 1408 కోట్ల రూపాయల దిగుమతి సుంకాలను ఎగవేసింది. తాము చెల్లించినదానికి , వాస్తవంగా చెల్లించాల్సిన కస్టమ్స్‌ డ్యూటీకి ఉన్న తేడాలో ఒప్పో కేవలం 450 కోట్లు మాత్రమే చెల్లించిందని ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తరువాత ఒప్పో ఇండియాకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. మొత్తం 4,389 కోట్ల రూపాయల కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాల్సిందిగా ఈ నోటీస్‌లో ఆర్థిక శాఖ కోరింది. ఇలా ఎగవేతకు పాల్పడినందుకు కంపెనీపైనా, కీలకంగా పని చేస్తున్న ఉద్యోగులపైనా జరిమానా విధించనున్నట్లు కూడా ఆర్ధిక శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement