Sunday, May 19, 2024

TDP – పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ఓట‌మి ఖాయం – చంద్ర‌బాబు

పుంగ‌నూరు – జన ప్రభంజనంతో పుంగనూరు దద్దరిల్లిందని, ప్రజలకు ఈ రోజే స్వాతంత్ర్యం వచ్చిందని, రేపటి నుంచి అన్నీ మంచిరోజులేనని అన్నారు. గెలిచేది మనమేనని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయ‌న మాట్లాడుతూ, ఇక్కడ పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు మన చల్లా బాబు అంటూ వ్యాఖ్యానించారు. చల్లా బాబు ఓ బుల్లెట్ అని, దూసుకెళతాడని అన్నారు. రామచంద్రారెడ్డీ మిడిసిపడుతున్నావు… కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలిక ఉందా? అని ప్రశ్నించారు. నల్లారి కుటుంబం ఒక రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం… ఆయన తండ్రి రాజకీయ నాయకుడు, ఆయన రాజకీయ నాయకుడు. ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటే, ఒకటి నేను, రెండు కిరణ్ కుమార్ రెడ్డి అని వివరించారు.

“పాపాల పెద్దిరెడ్డీ… నువ్వు ఎమ్మెల్యేవి, మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే. మేమందరం నీకు బానిసలం అనుకుంటున్నావా పెద్దిరెడ్డీ? బాగా కొవ్వెక్కిపోయింది. పొగరుబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ప్రజలే కొమ్ములు విరగ్గొట్టాలి. వీళ్ల రాజకీయ ఆధిపత్యానికి గండికొట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడం ఖాయం. మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధాని అవుతున్నారు. పాపాల పెద్దిరెడ్డీ ఇక నీకు నిద్రే ఉండదు. నిన్న మోదీ కూడా అన్నారు… ఎన్డీయే అంటే అభివృద్ధి అని వైసీపీ అంటే అవినీతి అని అన్నాడు. వైసీపీ అవినీతికి ఆద్యుడు ఇక్కడే ఉన్నాడు… ఇంకెవరు పాపాల పెద్దిరెడ్డే!

- Advertisement -

బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటివాళ్లను భూస్థాపితం చేస్తేనే ప్రజలకు అభివృద్ధి ఉంటుంది. ఈయనొక మంత్రి… దోపిడీ కోసమా ఈ మంత్రి? శివశక్తి డెయిరీకి పోటీగా ఇతర డెయిరీలు రానిస్తున్నారా? ఇదేమైనా ఆయన అబ్బ సొత్తా? మామిడికాయల్లోనూ కమీషన్లు కొట్టేసిన దుర్మార్గుడు ఇతడు. ఆవులాపల్లి రిజర్వాయర్… అనుమతులు ఉన్నాయా? కాంట్రాక్టు చేపట్టింది పీఎల్ఆర్ కంపెనీయా, కాదా… పీఎల్ఆర్ కంపెనీ ఎవరిది? రైతుల పొట్టగొట్టి వాళ్లను ఆ ఊరి నుంచి తరిమేయాలనుకుంటున్నాడు. మంత్రులు వీళ్లే, ఎంపీలు వీళ్లే, కాంట్రాక్టర్లు వీళ్లే, మైనింగ్ వీళ్లలే, ఇసుక వ్యాపారం వీళ్లదే, మద్యం వ్యాపారం వీళ్లదే… ఇంకేమీ మిగలకుండా ఊడ్చేశాడు.

నా నియోజకవర్గంలో గ్రానైట్ కూడా కొట్టేశారు. రూ.30 వేల కోట్లు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దిరెడ్డి! ఈయన మళ్లీ విద్యుత్ మంత్రి కూడా. చార్జీలు పెరిగాయా లేదా… దానికంతటికీ కారణం ఇతడి పనులే. పుంగనూరులో దాడులు జరగని రోజు లేదు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్ట్ జరగని రోజు లేదు… వేలమందిపై కేసులు పెట్టారు. చౌడేపల్లి మండలం టీడీపీ అధ్యక్షుడు రమేశ్ రెడ్డిని కూడా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. అతడు ఒక్కడే కాదు… ఇలా అరెస్ట్ అయిన వాళ్ల జాబితా మొత్తం ఉంది.

ఇతనొక రకం అయితే, జగన్ మోహన్ రెడ్డి ఒక సైకో. అతడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఒకసారి తండ్రిలేని బిడ్డను అన్నాడు. రెండోసారి అందరికీ ముద్దులుపెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత బాదుడే బాదుడు! ఆ బాదుడు ఎవరైనా భరించే పరిస్థితిలో ఉన్నారా? మద్యం ధరలు పెంచేశాడు. ఈ జగ్గూ భాయ్ కరెంటు చార్జీలు పెంచాడా, లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా, లేదా? పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా, లేదా? ఆస్తి పన్ను కూడా పెరిగింది. ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేశాడు ఈ చెత్త ముఖ్యమంత్రి!

2019లో కోడికత్తి డ్రామా ఆడాడు. కోడికత్తితో హత్యాప్రయత్నం చేశామంట. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నాడు… గులకరాయి కనపడదు కానీ దెబ్బ మాత్రం తగులుతుంది. నీ డ్రామాలతో ఎవరిని మోసం చేస్తావు జగ్గూ భాయ్? ఇతడు నార్సీ విధానం స్వీకరించాడు. హిట్లర్ మాదిరిగా కావాలనుకుంటున్నాడు. ఉత్తర కొరియా ఆయన కిమ్ ఉన్నాడు… ఈయన కిమ్ బ్రదర్… జిమ్! ఎవడూ ఆనందంగా ఉండకూడదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, డబ్బంతా ఆయన వద్దే ఉండాలి.

మళ్లీ క్లాస్ వార్ అంటాడు… క్లాస్ వార్ కాదు జగ్గూ భాయ్! ఇది క్యాష్ వార్! ఖజానాలో ఉండాల్సిన డబ్బంతా నీ దగ్గర, పాపాల పెద్దిరెడ్డి దగ్గర ఉంది. జూన్ 4న ఆ డబ్బంతా కక్కిస్తా… ఆ డబ్బు పేదలకు పంచేస్తా. పుంగనూరులో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ సందర్భంగా వారికో హామీ ఇస్తున్నా. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ముస్లింలకు ఎప్పుడూ అన్యాయం జరగలేదు, జరగదు. ఆయన పేదలకు న్యాయం చేయడంలో ముందుండే వ్యక్తి… ఆయనంటే నాకు గౌరవం. ఎస్సీల కోసం సబ్ ప్లాన్ తీసుకువచ్చి, దాన్ని చట్టపరంగా పాస్ చేసి అమలు చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. అదీ పేదల పట్ల నిబద్ధత… మైనారిటీ సోదరులకు న్యాయం చేశాడు.

మిథున్ రెడ్డిని అడుగుతున్నా… ఢిల్లీలో ఏం చెప్పావ్ నువ్వు? సీఏఏ బ్రహ్మాండంగా ఉందని చెప్పావా, లేదా? ఎన్ఆర్సీ సమర్థించావా, లేదా? ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయాలు చేస్తావా? ఇప్పుడు మేం ఎన్డీయేలో ఉన్నాం కాబట్టి ఏదో జరిగిపోతుందని కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు.

మైనారిటీలకు, ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు నేను కాపాడతా. ఉర్దూను రెండో అధికార భాష చేశాను, ఉర్దూ యూనివర్సిటీ తీసుకువచ్చాను. షాదీ ఖానాలు కట్టించాం, దుల్హన్ పథకం ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమామ్ లు, మౌజన్ లకు, మసీదులకు ఆర్థికసాయం చేశాం. మేం పొత్తు పెట్టుకుని వాస్తవాలు చెబుతున్నాం. కానీ జగన్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాష్ట్రం కోసం పొత్తు మంచిదా, చీకటి ఒప్పందం మంచిదా? కేసుల కోసం నువ్వు ఒప్పందం చేసుకున్నావు… మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నాం.

ఇక్కడ పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు. పొత్తు కోసం చొరవ చూపింది పవన్ కల్యాణే. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి, ఏమీ ఆలోచించకుండా పొత్తు ప్రకటన చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఇక్కడి పాపాల పెద్దిరెడ్డి కొడుకు పిఠాపురం వెళతాడంట. ఇంట్లో వేగలేవు కానీ… బయట మాత్రం ప్రగల్భాలు పలుకుతావా?

ఇక్కడి జనసైనికులు గ్లాసుకు పదును పెట్టాలి. పుంగనూరులో జనసేన అభ్యర్థిత్వం లేకపోయినా పవన్ కల్యాణ్ స్ఫూర్తి ఉంది. జనసేన కార్యకర్తలు, జనసైనికులు, టీడీపీ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు… అందరిదీ ఒకటే ఆలోచన… ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించాలి… పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి. ఒకసారి చల్లాబాబు ఆయన చేతిలో ఓడిపోయాడు… కానీ ఈసారి చల్లా బాబు చేతిలో అతడు చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు” అంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement