Thursday, May 16, 2024

విపక్షాలు ఏకమైతే బీజేపీకి 50 సీట్లే.. 2024లో విలక్షణ తీర్పుతథ్యం

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ 50 సీట్లకు పడిపోతుందని జేడీయూ చీఫ్‌, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ చెప్పారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటై పోరాడితేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఈ దిశగా తన వంతు కృషిచేస్తానని తెలిపారు. శనివారం పాట్నాలో జరిగిన జేడీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విపక్షాల ఐక్యతకు పిలుపునిచ్చారు. గతనెలలో బీహార్‌లో మహాఘట్‌ బంధన్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి, జాతీయ రాజకీయాలలో నితీశ్‌ పాత్రపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన్ను కలవడం ఈ చర్చకు బలాన్నిచ్చింది. వచ్చేవారం ఢిల్లి వెళ్తున్నానని, విపక్షాలకు చెందిన ముఖ్యనేతలను కలుస్తానని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్నిపార్టీలు జతకడితే, ప్రజలతీర్పు అద్భుతంగా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై మరిన్ని వివరాలు చెప్పడానికి ఆయన నిరాకరించారు. కాగా, కార్యవర్గసమావేశంలో జేడీయు శ్రేణులు నితీశ్‌ కుమార్‌ను దేశ్‌ కీ నేతా అంటూ నినాదాలు చేశారు.

మీ వైఖరి రాజ్యాంగబద్ధమేనా?

మణిపూర్‌లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు. కాషాయ పార్టీ నిర్వాకం రాజ్యాంగబద్ధమైనదేనా అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో ఎమ్మెల్యేలు పార్టీలు మారడాన్ని ప్రస్తావిస్తూ బీహార్‌లో తాను ఎన్డియే కూటమి నుంచి బయటకు వచ్చి మహాకూటమి సర్కార్‌ను ఏర్పాటు చేసే క్రమంలో ఆరుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు తమను కలిసి పార్టీతోనే కలిసి ప్రయాణిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాగా మణిపూర్‌లో ఆరుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం బీజేపీలో చేరడంతో జేడీ(యూ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఆగస్ట్‌ 25న అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన జేడీ(యూ) ఏకైక ఎమ్మెల్యే టెకి కసో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement