Tuesday, May 14, 2024

రోడ్డు మాఫియా, రహదారులనూ వదలరు.. తవ్వేసి కంకర, మట్టి చోరీ!

(హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) : తెలుగు రాష్ట్రాల్లో దొంగలు పెట్రేగిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు కూడా చోరీల్ని సమర్ధవంతంగా అరికట్టలేకపోతున్నాయి. ఇప్పటికే దొంగలు మాఫియాలా తయారయ్యారు. ప్రకృతి వనరుల్ని దోచేస్తున్నారు. నదీగర్భాల్ని తొలిచేస్తున్నారు. నదుల్లోని ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. పొలాల్లోని మట్టిని కబళిస్తున్నారు. కొండల్ని పిండి చేస్తున్నారు. భూగర్భాల్ని తవ్వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నాలుగు ఎకరాలకు అనుమతులు పొంది నాలుగొందల ఎకరాల్లో మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పుడు దొంగలు చోరీలకు మరికొన్ని సరికొత్త మార్గాల్ని అన్వేషించారు. ఏపీ రాజధాని అమరావతి హైకోర్టుకు దారితీసే ప్రధాన రహదారిని కూడా దొంగలు తవ్వేశారు. దీనిపై కంకర, ఇసుక, మట్టి తరలించుకుపోయారు. అది కూడా ఓ రాష్ట్ర రాజధాని నగర పరిధిలో సాక్షాత్తు శాసనసభ, శాసనమండలి భవనాలకు అతి సమీపంలోనే ఇంతటి భారీ చోరీకి పాల్పడ్డారు.

ప్రతిరోజు ఉన్నతాధికారులు ఈ మార్గం నుంచే ప్రయాణిస్తారు. హైకోర్టుకెళ్ళే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదార్లు కూడా ఈ దారినే ఉపయోగిస్తారు. ఈ చోరీపై న్యాయస్థానాలు కూడా నిస్సహాయత వ్యక్తంచేశాయి. ప్రభుత్వ ఉదాసీనతను గుర్తించాయి. అలాగే హైదరాబాద్‌లో 14ఏళ్ళ క్రితం జర్నలిస్టులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు సొసైటీలకు ఏర్పడితే స్థలాలిచ్చేందుకు అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులిచ్చారు. దీంతో హైదరాబాద్‌ శివార్లలో జర్నలిస్టులతో పాటు అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధులు సొసైటీలుగా ఏర్పడి ప్రభుత్వం నిర్దేశించిన ధరలు చెల్లించి స్థలాల కొనుగోలుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ఊరికి దూరంగా కొంత స్థలాన్ని కేటాయించింది. ఒక్కో వర్గానికి ప్రత్యేకంగా ఈ కేటాయింపులు జరిపింది. ఇందులో కొన్ని సొసైటీ స్థలాలకు సంబంధించి చుట్టూ ప్రహరీల నిర్మాణం కూడా పూర్తి చేశారు.

కొన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. ఈలోగా ఈ ఉత్తర్వులపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించడంతో సొసైటీల తరపున వ్యక్తిగత కేటాయింపులకు ఆటంకమేర్పడింది. సుమారు 14ఏళ్ళ పాటు ఈ కేసు క్రిందికోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సాగింది. ఇటీవలె పదవీ విరమణ చేసిన జస్టిస్‌ ఎన్‌.వి. రమణ దీనిపై మధ్యంతర తీర్పును వెలువరించారు. ఇప్పుడు ఈ స్థలాల్లోని రోడ్లను దుండగులు తవ్వేశారు. అందులోని కంకర, ఇతర పరికరాల్ని కూడా దొంగిలించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు, మంచినీటి పైప్‌లను కూడా తస్కరించారు. ఈ సంఘటనలన్నీ తెలుగు రాష్ట్రాల్లో దొంగల విజృంబణకు అద్దంపడుతున్నాయి. కాదేదీ దొంగతనానికి అనర్హతనే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తున్నాయి. ఓ వైపు విచ్చలవిడిగా ప్రకృతి వనరుల దోపిడీ సాగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ కారణంగానే మాఫియాగా రూపొందిన దొంగలు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. ఆఖరకు రోడ్లను కూడా వదలకుండా దొలిచేసి దొంగిలిస్తున్నారు. ప్రభుత్వాలు దొంగతనాలపై కఠినంగా వ్యవహరించాలి. దొంగతనాల్ని అరికట్టే చర్యలు వెంటనే చేపట్టాలని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement