Friday, April 26, 2024

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.. కేంద్రానికి బీసీ రాజ్యాధికార సమితి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లను చట్టబద్దం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ కోరారు. న్యూఢిల్లీలోని తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీసీలకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లోసరైన ప్రాధాన్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేతి వృత్తులు, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన వారు అగ్రవర్ణాల, కార్పొరేట్ శక్తుల చేతుల్లో శ్రమ దోపిడీకి గురవుతున్నాయని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వకాలంలో కులవృత్తులకు దక్కిన గౌరవం ఈ ఆధునిక యుగంలో లేదని వాపోయారు.

ఈ పరిస్థితిని మార్చాలంటే బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలని, వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు. నేటికీ చేతివృత్తుల మీద ఆధారపడిన బీసీలకు విద్య, ఉద్యోగవకాశాలతో పాటు రాజకీయపరంగానూ రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి ఢిల్లీ కేంద్ర కమిటీ కన్వీనర్ ప్రకాష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement