Monday, May 13, 2024

Attacks – సూడాన్ లో రెండు జాతుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ – 52 మంది మృతి..

సూడాన్ – ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. అబేయిలో కొందరు ముష్కరులు, గ్రామస్తుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 52 మంది మృతిచెందగా, 64 మంది గాయపడ్డారు.
మృతుల్లో ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ అధికారి కూడా ఉన్నారు.

కొందరు ముష్కరులు సామాన్యులపై దాడికి పాల్పడ్డారని అబేయి సమాచార శాఖ మంత్రి బుల్లిస్ కోచ్ తెలిపారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భూవివాదాల నేపధ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హింసకు పాల్పడినవారు న్యూర్ తెగకు చెందినవారని, వారు భారీగా ఆయుధాలు కలిగి ఉన్నారని కోచ్ తెలిపారు. గత ఏడాది వరదల కారణంగా ఈ సాయుధ యువకులు వార్రాప్ రాష్ట్రానికి వలస వెళ్లారని సమాచారం. సూడాన్‌లో జాతి హింస రోజురోజుకూ పెరిగిపోతోంది.

అబేయిలోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర భద్రతా దళం శాంతి పరిరక్షకుని మృతికి దారితీసిన హింసను ఖండించింది. అబేయిలోని పలుప్రాంతాల్లో అంతర్ మత ఘర్షణలు జరిగాయని యూఎన్‌ఐఎస్‌ఎఫ్‌ఏ ధృవీకరించింది. కాగా సూడాన్, దక్షిణ సూడాన్లు రెండూ అబేయిపై ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి.
2011లో సూడాన్ నుండి దక్షిణ సూడాన్ స్వతంత్రం పొందిన తర్వాత కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. ఆఫ్రికన్ యూనియన్ ప్యానెల్ అబేయిపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రతిపాదించింది. అయితే ఎవరు ఓటు వేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అబేయి ప్రాంతం దక్షిణ సూడాన్ ఆధీనంలో ఉంది. మార్చిలో దక్షిణ సూడాన్ తన దళాలను అబేయిలో మోహరించినప్పటి నుండి అంతర్గత సరిహద్దు ఘర్షణలు మరింతగా పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement