Sunday, May 19, 2024

Delhi | హస్తినలో ‘ఆహా గోదారి’.. ఢిల్లీ ఏపీ భవన్‌లో డాక్యుమెంటరీ ప్రదర్శన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత ద్వీపకల్పంలో ఎంతో విశిష్ట స్థానం కల్గిన గోదావరి నదిపై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం ‘ఆహా గోదారి’ ఇప్పుడు హస్తిన చేరింది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో ఉన్న అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ ఏడాది మార్చి 30న ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది, యానాం వరకు సాగే గోదావరి నది ప్రయాణంపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీని ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాంపై లక్షల సంఖ్యలో తెలుగు ప్రజలు వీక్షించారు.

గోదారి సాగినంత దూరం కనిపించే సంస్కృతులు, మతపరమైన విశ్వాసాలు, ప్రజల జీవన విధానం, హిందువులు, సిక్కులు, ఇస్లాం  విశ్వాసాలు వంటి వివరాలన్నీ ఈ డాక్యుమెంటరీని మరింత అర్థవంతంగా,  అందరిదీ అనే భావనను కలగజేసేలా తీర్చిదిద్దినట్టు నిర్వాహకులు తెలిపారు. మన చరిత్రను, సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి అత్యుత్తమమైన మాధ్యమం సినిమా అని, ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీ ద్వారా తాము గోదావరి నదితో పెనవేసుకున్న చరిత్ర, సంస్కృతిని భావితరాలనకు అందించే ప్రయత్నం చేశామని ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది. చూసిన ప్రతి ఒక్కరూ బావుందని మెచ్చుకుంటున్నారని, ఇటువంటి స్వచ్ఛమైన, అచ్చమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించినందుకు ఆనందంగా ఉందని సంస్థ అధికార ప్రతినిధి అభ్యదయ అన్నారు.

- Advertisement -

ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో, ఆలోచనలతో ఆడియన్స్ ని అలరించడానికి ఆహా ఎలా సమాయత్తమవుతుందో చెప్పడానికి అద్భుతమైన ప్రతీక ఆహా గోదారి అని వ్యాఖ్యానించారు. ‘ఆహా గోదారి’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని దివాకర్‌ కాన్సెప్ట్ సంస్థ డిజైన్‌ చేసి, దర్శకత్వం వహించినట్టు తెలిపారు. ఆహా గోదారి సాంస్కృతిక పరమైన బేధాలను, సరిహద్దులను లెక్కచేయకుండా అందరి మన్ననలు పొందుతోందని అన్నారు. తెలంగాణ మంత్రి కేటీ రామారావు ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీ గురించి రీట్వీట్‌ చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఢిల్లీలో ప్రదర్శించిన డాక్యుమెంటరీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్ల ఉన్నతాధికారులు, సిబ్బందితోపాటు దేశ రాజధానిలో నివసిస్తున్నపలువురు తెలుగు ప్రజలు వీక్షించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement