Sunday, May 19, 2024

నేటి సంపాదకీయం – పథకాలకు అడ్డొస్తున్న కోడ్‌!

ర్టీలు ఏవైనా, కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమం తమకు రెండు కళ్ళు అని ప్రక టిస్తూ ఉంటాయి. వాటి చిత్తశుద్ధిని శంకించలేం. అనుకు న్నది అమలు చేయగలిగితే ప్రభుత్వాలకు తిరుగు ఉండదు. అయితే, ప్రభుత్వా లను చిక్కుల్లో పడేసేందుకు ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. అవి వాటి సహజ లక్షణం. ఎన్నికల్లో వాగ్దానాలను అమలు జేయని ప్రభుత్వాలకు ఉప ఎన్నికల ముందు కొత్త వాగ్దానాలు చేసే అర్హత ఎక్కడిదని ప్రతిపక్షాల వాదన.ఎన్నికల కోడ్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ మంతటా అధికారంలో ఉన్న పార్టీలకూ, ప్రభుత్వాలకూ ప్రతిబంధకంగా మారింది. ఈ నేపధ్యంలోనే దేశమంతటా కింది స్థాయి నుంచి పార్లమెంటు వరకూ ఒకేసారి ఎన్నికలు అమలు జరపాలన్న ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తరచూ తీసుకుని వస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు ఈ విధానం అమలులో ఉంది. 1967 సాధారణ ఎన్నికల్లో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ఉత్తరాదిన బీహార్‌,ఉత్తరప్రదేశ్‌,హర్యానా తదితర రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోయాయి. దాంతో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాని విషయమైంది. దానికి తోడు ఏటేటా ఎన్నికల వ్యయం పెరిగిపోవడంతో రాజకీయ పార్టీలు కూడా ఇందుకు సుముఖంగా లేవు.ఉప ఎన్నికలు లేదా మినీ జనరల్‌ ఎన్నికల పేరిట కొన్ని చోట్ల ఎన్నికలు నిర్వహించడం అనివార్యమవుతోంది. దానికి తోడు ఉభయ శాసనసభలు రెండింటిలో దేనిలోనూ సభ్యులు కాని వారిని ముఖ్యమంత్రులుగా నియమించే లేదా ఎన్నుకునే సంప్రదాయం అమలులోకి రావడం వల్ల కూడా ఉప ఎన్నిక లు అనివార్యం అవుతున్నాయి. సిట్టింగ్‌ సభ్యుల రాజీనామా వల్ల,లేదా ఆకస్మిక మరణం వల్ల ఖాళీ ఏర్పడిన స్థానాలకు రాజ్యాంగం ప్రకారం ఆరు నెలలు లోగా ఎన్నికలు జరపాల్సి ఉంది.ఉప ఎన్నికలు అనివార్యమవుతున్న పరిస్థితుల నేపధ్యం ఇదీ. వీటిలో హుజూర్‌నగర్‌ స్థానానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా వల్ల, ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్‌ స్థానానికి సిట్టింగ్‌ సభ్యుని ఆకస్మిక మరణం వల్ల ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ రెండు స్థానాలూ అధికార పార్టీలకు చెందినవే. అయితే, హుజూరునగర్‌ స్థానానికి ఆరు సార్లు పైగా ప్రాతినిధ్యం వహించిన ఈటల రాజేందర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్‌ స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సతీమణిని అధికార పార్టీ ఎంపిక చేయడం తెలుగుదేశం, జనసేన పోటీకి దూరంగా ఉండటం తెలిసిందే. అక్కడ నవరత్నాల వంటి పథకాలు ఇప్పటికే అమలులో ఉనప్పటికీ దళితబంధువంటి సమస్యలు అక్కడ ఉత్పన్నం కాలేదు. హుజూర్‌ నగర్‌ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాజేందర్‌ బీజేపీ తరఫునపోటీ చేస్తుండటం వల్ల తెరాస, బీజేపీలు రెండూ ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు గడిచిన ఏడు సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలను అమలు జేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమా అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికి ఉన్న సౌలభ్యం అదీ.అయితే, ఈటల రాజేందర్‌ రాజీనామాకు చాలా ముందే కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరుగు తుండగానే ఉప ఎన్నిక వచ్చి పడింది. దళితుల కుటుంబాలకు 30 లక్షల రూపాయిల వంతున లబ్ధిచేకూర్చే ఇటువంటి పథకం దేశం మొత్తం మీద ఎక్కడా అమలు కావడం లేదు. అందువల్ల తెరాస శ్రేణులు సహజంగానే దీనిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. అయితే, ఈ పథకం అమలును ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకూ అమలు జరపరాదని హైకోర్టును ప్రత్యర్ధులు ఆశ్రయించడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇది కొత్త కాదు, తెలంగాణలో మాత్రమే జరిగింది కాదు. ఇలాంటి సంశయాలు లబ్ధిదారులైన బడుగువర్గాల ప్రయోజనాలకు ఆటంకం కలగకుండా రాజ్యాంగ నిపుణులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ మేలు చేకూర్చే పథకాలను ఎన్నికల పథకాలుగా పరిగణించడం ప్రజాస్వామ్యానికి హానికరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement