Friday, May 3, 2024

నేటి సంపాదకీయం – రగులుతున్న అన్నదాత

ఉత్తరాదిన మన ప్రాంతంలో కన్నా చలి విజృంభిస్తోంది. చలిని సైతం లెక్క చేయకుండా రైతులు తమ ఆందోళనను కొనసాగించాలనే నిర్ణయించడం వారిలో పట్టుదలకు నిదర్శనం. రైతుల మద్దతు ధర విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వనంత వరకూ మండీల్లో దళారులు చెల్లించే ధరకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవల్సి వస్తోందని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ అన్నారు. రైతులకు మద్దతుగా ఆయన తాజాగా ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వెల్లడిస్తూ కేంద్రం చేసే ప్రకటనలకూ, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకూ ఏమాత్రం పొంతన లేదని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నందున అన్ని పార్టీలూ ఇప్పుడు రైతుల పక్షాన నిలబడుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా ఈ మధ్య రైతుల సమస్యలపై అన్ని ప్రాంతాల్లో సంఘీభావ సదస్సులను నిర్వహిస్తున్నారు. వీరికి తామేమీ తక్కువ కాదన్నట్టుగా వరుణ్‌ గాంధీ కూడా రైతుల సమస్యలపై గళం విప్పారు. తాము పండించిన పంటకు తామే నిప్పు పెట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారంటే, ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పోవడమే కారణమని వరుణ్‌ గాంధీ అన్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై కొన్నిసార్లు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

నేరుగా మోడీ ఇందుకు అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ, ఫలితం ఎంతవరకూ ఉంటుందనేది సందేహాస్పదమే. మరో వంక ఢిల్లిd సరిహద్దుల్లో తొమ్మిది మాసాలు పైగా ఆందోళన సాగిస్తున్న రైతుల సంఘాల సమాఖ్య తమ ఉత్పత్తులను పార్లమెంటు వద్దకు తీసుకుని వెళ్ళి విక్రయిస్తామంటోంది. ఈ సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాకేష్‌ తికాయత్‌ ఢిల్లిd సరిహద్దుల్లో బారికేడ్లనూ, ఇతర అడ్డంకులను తొలగించిన తర్వాత రైతులు తమ ఉత్పత్తులతో పార్లమెంటుకు వెళ్ళి వాటిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారని ప్రకటించారు. రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రధాని మోడీ పార్లమెంటులోనే ప్రకటించిన దృష్ట్యా. మరెక్కడా మద్దతుధర లభించకపోవడం వల్ల నేరుగా రైతులు తమ ఉత్పత్తులను పార్లమెంటుకే తీసుకుని రావాలని నిర్ణయించుకు న్నారని తికాయత్‌ ప్రకటించారు. అయితే, ఇందుకు అనేక అవాంతరాలు ఉండవచ్చు. శాంతిభద్రతల పేరిట రైతుల ర్యాలీలనూ,బైఠాయింపులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

దేశంలో అన్ని చోట్లా ఉన్నదే ఇది. అందువల్ల ఇదొక ప్రచారంగా మాత్రమే మిగిలి పోవచ్చు. రైతుల సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రధానమంత్రి మోడీకి ఉండి ఉండవచ్చు. ఆయన మంత్రివర్గ సహచరులు దీనిపై తగిన రీతిలో స్పందించడం లేదు. ముఖ్యంగా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌ తమ అభిప్రాయాలను ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్ళడం లేదని తికాయిత్‌ మంత్రి ఎదుటే అన్నారు.కేంద్ర మంత్రివర్గ సభ్యుల్లో, ఎంపీల్లో చాలా మంది రైతుల డిమాండ్లను సమర్ధిస్తున్నారనీ, ఏ ప్రభుత్వమూ కూడా ఎంపీలు,మంత్రుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోదని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. పంజాబ్‌, హర్యానా, తదితర ఉత్తరాది రాష్ట్రాల సీఎంలు రైతుల ఆందోళనలను అడ్డుపెట్టుకుని స్వరాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాయే తప్ప మద్దతు ధర విషయంలో చిత్తశుద్ధితోకృషి చేయడం లేదని తికాయత్‌ అన్నారు.ఈ ఉద్యమంలో పాల్గొంటున్న ఇతర నాయకులు, ఉద్యమానికి మద్దతు ఇస్తున్న ఇతర నాయకులు కూడాపలు సందర్భాల్లో ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.

దేశంలో ఆహార సమస్య పెరిగిపోతోందని ప్రభుత్వ వర్గాలే ప్రకటిస్తున్నప్పుడు రైతులు కోరిన ధర చెల్లించి ఆహార ధాన్యాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి లాభమే కదా అని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సీఎంలు ఇతర సమస్యలకు ఇస్తున్న ప్రాధాన్యం రైతుల మద్దతుధర విషయంలో ఇవ్వడం లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద రైతుల సమస్యలపై ముఖ్యంగా మద్దతుధరపై మోడీకి కేంద్ర మంత్రులు సరైన సమాచారాన్ని అందివ్వడం లేదన్న అభిప్రాయం నెలకొన్నది. సాగు చట్టాలపై పంతాలకు పోయి ఆయనదిగి రావడం లేదన్న అభిప్రాయమూ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement