Saturday, April 27, 2024

నేటి సంపాద‌కీయం – నాలుగో ద‌శ‌కు సంకేతాలు.!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో సంప్రదాయ వైద్య కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై సంప్రదాయ వైద్యానికి భారత్‌, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసించి, ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని ఆకాశానికి ఎత్తేశారు. సరిగ్గా అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఒక వార్త వచ్చింది. భారత్‌లో కొవిడ్‌ మృతుల సంఖ్యను తగ్గించి చూపించారంటూ ఆ సంస్థ బృందంలోని సభ్యుడు ఒకరు ప్రశ్నించారు. వాస్తవిక మరణాల కన్నా తక్కువ చూపారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరో గ్య సంస్థ బృందం నివేదిక ఇంకా విడుదల కాలేదు. భారత్‌లో 2021 సంవత్సరంలో ఆరోగ్య సంస్థకు అందిన సమాచారం కన్నా నాలుగురెట్లు తక్కువగా మరణాలను చూపిందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆ సంస్థ డైరక్టర్‌ జనరల్‌ జామ్‌నగర్‌లో మన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్రశంసిస్తున్న సమయంలోనే ఆ సంస్థ అందించిన వివరాలతో న్యూయార్క్‌ టైమ్స్‌ ఈ వ్యాసాన్ని ప్రచురించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి కొవిడ్‌ సమయంలో మన దేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో వెల్లడైన మరణాల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ముఖ్యంగా చైనాలో మన దేశంలో కన్నా ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇరాన్‌, బంగ్లాదేశ్‌, ఇథోపియా, ఈజిప్టులో ఎక్కువ మరణాలు సంభవించినట్టు సమాచారం అందింది.

ఆ విషయాలను పట్టించుకోకుండా డబ్ల్యూహెచ్‌ఓ భారత్‌లో సంభవించిన మరణాల పైనే దృష్టి పెట్టడం విశ్లేషకులను ఆశ్చర్య పర్చింది. టెడ్రోస్‌ చైనా పట్ల మొదటి నుంచి సానుకూల వైఖరిని అనుసరిస్తున్నారన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. ఆయన నిర్వహిస్తున్న పదవిలో అంతకుముందు చైనాకి చెందిన అధికారి ఉండే వాడు. ఆ అధికారి టెడ్రోస్‌ కోసం పదవిని ఖాళీ చేసినందునే టెడ్రోస్‌ చైనా పట్ల సానుకూల వైఖరిని అనుసరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే, కరోనా పుట్టుక పై వచ్చిన పలు రకాల వార్తలపై టెడ్రోస్‌ సరైన రీతిలో స్పందించలేదు. నిజానికి చైనాలోని వూహన్‌ నగరంలోనే మొదట కరోనా బయటపడినట్టు సమాచారం అందినా, దానిని ఆయన నిక్కచ్చిగా ధ్రువీకరించలేదు. ఆనాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా మీదా ఆరోపణలు చేస్తూ, డబ్ల్యూ హెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నిర్మొహ మాటంగానే ప్రకటించారు. దీనిని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి ఖండించారు. అది వేరే విషయం. అప్పట్లో ట్రంప్‌ మరి కొంత ముందుకు వెళ్ళి కరోనాను చైనా వైరస్‌ అని అభివర్ణించారు.

యావత్‌ ప్రపంచానికీ సవాల్‌గా మారిన కరోనా పుట్టుక, వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించి వాస్తవాలను వెల్లడించాల్సి ఉండగా, టెడ్రోస్‌ వహించిన పాత్ర వివాదాస్పదంగా ఉన్నట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కరోనా అదే చైనాలో తిరిగి విజృంభిస్తుండటంతో ఆ వైరస్‌ పూర్తిగా చావలేదనీ, అణగి ఉండి ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్న కారణంగా దాని పుట్టుక చైనాలోని వూహ న్‌ నగరమేనన్న తొలి సమాచారం వాస్తవమేనని స్పష్టమవుతోంది. మన దేశంలో కరోనా నాల్గవ దశ ప్రారంభమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా వ్యాప్తిలో కీలకమైన రిప్రొడెక్టివ్‌ వాల్యూ (ఆర్‌.వాల్యూ) మూడు నెలల వ్యవధిలో ఒకటి దాట డంతో వైద్య రంగానికి చెందిన ప్రముఖులు కలవర పడు తున్నారు. కరోనా ప్రారంభమైనప్పటికీ ఆర్‌ ఫ్యాక్టర్‌ను లెక్క గడుతున్న సుప్రసిద్ధ శాస్త్రవేత్త సిద్ధార్ధ సిన్హా చెన్నై, ముంబై, బెంగళూరు నగరాల్లో ఆర్‌ ఫ్యాక్టర్‌ ఒకటి దాటిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఏయే జాగ్రత్తలైతే తీసుకున్నారో ఇప్పుడు కూడా అవే జాగ్ర త్తలు తీసుకోవాలనీ, మాస్క్‌ ధారణ తప్పనిసరి కావా లనీ, భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆయ న హెచ్చరించారు.

కరోనా పెరుగుదలను ఆర్‌ ఫ్యాక్టర్‌ ద్వారా అంచనా వేస్తారు. ఢిల్లి, ఉత్తరప్రదేశ్‌లలో కరోనా మళ్ళీ వేగంగా పెరుగుతుండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ప్రభుత్వాలను హెచ్చరించారు.ఇటీవల శోభాయాత్రలోనూ, ఇతర పర్వదినాల సందర్భంగా సమూహాలుగా ఏర్పడటం, ఊరేగింపుల్లో పాల్గొనడం వల్ల కరోనా నాల్గో దశ ప్రవేశించి ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కరోనా పూర్తిగా తొలగిపోలేదు. మరోసారి 2వేల కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా 4లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా, 2,037 కేసులు నమోదు అయినట్టు తేలింది. ఇంకా చాలాచోట్ల పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యరంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నాల్గవ దశ ప్రవేశించేందుకు ఇవన్నీ సంకేతాలు కావచ్చని పేర్కొంటూ జాగ్రతలు పాటించాలని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement