Tuesday, April 30, 2024

నేటి సంపాదకీయం-ఆప్‌.. ప్రతాపం

చండీగఢ్‌… పంజాబ్‌, హర్యానాలకు రాజధాని. అక్కడి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు రెండు రాష్ట్రాల్లో ప్రజల నాడిని తెలియజేస్తాయని భావించ వచ్చు. ఈసారి అక్కడ జరిగిన ఎన్నికల్లో మొత్తం 35 సీట్లలో ఆప్‌కి 14 సీట్లు, బీజేపీకి 12, కాంగ్రెస్‌ 8 సీట్లు వచ్చాయి. అకాలీదళ్‌కి ఒక సీటు మాత్రమే వచ్చింది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో.. ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చే సంవత్సరం రాష్ట్రంలో ప్రజల నాడిని తెలియజేస్తున్నాయనీ, పంజాబ్‌ అసెంబ్లి ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయం సాధించడం తథ్యమని ఆప్‌ సారథి, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. అయితే, చండీగడ్‌లో అన్ని మతాలు, కులాలు, వర్గాల వారూ ఉంటారనీ, ఇది కాస్మాపాలిటన్‌ నగరం కనుక ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయని కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానించారు. తమ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు జేస్తున్న దృష్ట్యా, తిరిగి తమకే అధికారం లభిస్తుందని కాంగ్రెస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చండీగఢ్‌ ఎన్నికలు కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి కనువిప్పులాంటివి. ఈ ఫలితాల సంకేతాలు ముందే అందడం వల్లనే ఏమో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కమలనాథులు ప్రయత్నించారు. కరోనా తగ్గినప్పటికీ, ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న కారణంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలనిర్వహణ సాధ్యాసాధ్యాలను గురించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్న‌త అధికారులతో చర్చలు జరిపారు. అయితే, కరోనా వ్యాక్సినేషన్‌ ఉత్తరాఖండ్‌, గోవాల్లో నూరు శాతం, ఉత్తరప్రదేశ్‌లో 85శాతం, పంజాబ్‌లో 80శాతం పూర్తి అయిన దృష్ట్యా, ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఉండదని తేల్చారు. అంటే వచ్చే సంవత్సరారంభంలో అసెంబ్లి ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారంజరిగి తీరుతాయన్నమాట. ఇందుకు సంబంధించి పార్టీలు అభ్యర్దుల ఎంపికను పూర్తి చేసే పనిలో ఉన్నాయి. చండీగఢ్‌లో బీజేపీ ప్రస్తుత మేయర్‌ రవికాంత్‌ శర్మ, మాజీ మేయర్‌ దావేష్‌ ముగ్దల్‌ ఓడిపోవడం ఆ పార్టీకి ఎదురు దెబ్బే. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లి సరిహద్దుల్లో రైతులు జరిపిన ఆందోళన ప్రభావం ఈ ఎన్నికలపై ఉండి ఉండవచ్చని కమలనాథులు అంటున్నారు.

అకాలీ, బీజేపీలు పొత్తు కలిగి ఉన్నంత కాలం చండీగఢ్‌లో మేయర్‌ పదవి ఎప్పుడూ ఈ కూటమిదే. అకాలీల సాయంతోనే చండీగఢ్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటోంది. అయితే, ఆ రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛినం కావడంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు గాలం వేసింది. అయితే, అమరీందర్‌సింగ్‌ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి సొంత కుంపటి పెట్టుకున్నారు. కానీ బీజేపీలో చేరలేదు. ఆయనతో పొత్తు కోసం కేంద్ర హోం మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్‌ షా మంతనాలు సాగిస్తున్నారు. అమరీందర్‌సింగ్‌ నిష్క్రమణ ప్రభావం వల్ల పంజాబ్‌లో కాంగ్రెస్‌ దెబ్బతినే అవకాశం ఉన్నప్పటికీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సిద్ధూ కాంగ్రెస్‌ విజయం కోసం క్రికెటర్లను కూడగడుతున్నారు. అకాలీదళ్‌ కిందటి సారిబీఎస్‌పితో పొత్తుపెట్టుకుంది. ఆ పార్టీకీ, బీజేపీకి మధ్య రైతుల ఆందోళన సందర్భంగా అగాధం పెరిగింది.

కాంగ్రెస్‌పై ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు ఆప్‌ సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు చండీగఢ్‌ మునిసిపల్‌ ఫలితాలే నిదర్శనం. చండీగఢ్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ పతిసారి కాంగ్రెస్‌, బీజేపీల మధ్యనే ఉండేది. ఈసారి ఆప్‌ రంగంలో ప్రవేశించడం వల్ల బీజేపీ దెబ్బతింది. అయితే, ఆప్‌ వల్ల తమ పార్టీకి రావల్సిన సీట్లు తగ్గేయన్న వాదాన్ని బీజేపీ చండీగఢ్‌ అధికార ప్రతినిధి నరేష్‌ ఆరోరా అంగీకరించడం లేదు. తమ పార్టీ ఓట్ల శాతం పై ఇంకా స్పష్టత రాలేదని ఆయన అన్నారు. మొత్తం మీద పంజాబ్‌లో ఆప్‌ ప్రవేశంతో కాంగ్రెస్‌, బీజేపీ ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉంది. అసెంబ్లి ఎన్నికల్లో కూడా ఇదే మాదిరి ఫలితాలు వస్తాయని కేజ్రీవాల్‌ అన్న వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగానే ఉంది. యూపీలో బీజేపీ ఓట్లను చీల్చగలదని భావిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement