Thursday, May 2, 2024

Editorial: హౌతీలకు ముకుతాడు

హౌతీ ఉగ్రవాదులు సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ప్రారంభించి యావత్‌ ప్రపంచాన్ని ఆందోళన కు గురి చేస్తున్నారు. తొంభయ్యో దశకంలో ప్రారంభమై న హౌతీ ఉద్యమానికి ప్రాతిపదిక అమెరికా సామ్రాజ్య వాదం పట్ల, పాశ్చాత్య దేశాల పెత్తనానికి వ్యతిరేకత. హౌతీలకు యెమన్‌లో సగం భూభాగంపై పట్టు ఉంది. లెబనాన్‌లోని షియా సైనిక, రాజకీయ సంస్థ హెజ్‌బొల్లా తో ప్రభావితమైన హౌతీ సంస్థ మొదట్లో మితవాద సంస్థ గానే ఉండేది. తర్వాత అమెరికా జరు పుతున్న దాడులకు ప్రతీకారం కోసం ఉగ్రవాద సంస్థ అవతారం ఎత్తింది.

జైదీ మత నాయకుడు హుస్సేన్‌ అల్‌ హౌతీ ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థకు అమెరికాను సమర్థిస్తున్న వారంతా శత్రువులే. ఇజ్రాయెల్‌ గాజాలో హమాస్‌ దళా లపై దాడులకు వ్యతిరేకంగా హౌతీ దళాలు విజృంభిస్తు న్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ ఇంకా వాటి మిత్రదేశాల కు చమురు, ఆహార ధాన్యా లు, నిత్యావసరాలు సరఫరా చేసే నౌకలపై సముద్రంలో కాపు కాచి దాడి చేయడం ద్వారా హౌతీ ఉగ్రవాదులు ప్రపంచం దృష్టి ని ఆకర్షించారు. గాజా స్ట్రిప్‌లో మానవతా సాయాన్ని అడ్డుకుం టున్న ఇజ్రాయెల్‌ దళాలను నిరోధించడమే తమ లక్ష్యంగా హౌతీలు ప్రకటించారు.

ఇజ్రాయెల్‌ దళాల దాడులకు ప్రతీకారంగా హౌతీలు నౌకలపై దాడులు ప్రారంభించారు. అయితే, హౌతీ లు జరుపుతున్న దాడుల్లో మన భారత నౌకా సిబ్బంది కూడా చిక్కుకుంటున్నారు. డిసెంబర్‌ 23న భారత్‌ వస్తున్న లైబేరియాకు చెందిన చెమ్‌ ప్లూటో అనే వాణిజ్య నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ తరువాత ఎర్రసముద్రంలోనే మరో నౌకపైన, అరేబి యా సముద్రంలో రెండు నౌకలపైనా ఇలాంటి దాడే జరిగింది. ఆయా నౌకల్లో భారతీయులను భారత నౌకా దళం కాపాడింది. ఎర్రసముద్రంలో నౌకలపై దాడులను హౌతీ ఉగ్రవాదులు దాదాపు రోజూ చేస్తున్నారు. గత నవంబర్‌ 19 నుంచి ఇప్పటివరకు 25 డ్రోన్‌ దాడులు జరిగినట్లు అమెరికా చెబుతోంది. ఈ దాడుల వెనుక ఇరాన్‌ హస్తం ఉందన్నది అగ్రరాజ్యం ఆరోపణ. అయితే, ఆ ఆరోపణలను ఇరాన్‌ ఖండిస్తోంది. తాజాగా గురువా రం నాడు పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్‌ పడవను పేల్చివేశారు. అయితే, అది హౌతీ వేర్పాటువాదులు అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు. నిజానికి ఆ పడవ ఉన్న ప్రాంతానికి సమీపంలో అమెరికాకు చెందిన అనేక నౌకలు, ఇతర దేశాలకు చెందిన వాణిజ్య నౌకలు ఉన్నా యి.

- Advertisement -

కానీ ఈ పడవ పేలుడు ప్రభావం వాటికి తాకలేదు. ఎర్రసముద్రంలో హౌతీ దాడులవల్ల అమెరికా దృష్టి ఇటు మళ్లడంతో సోమాలియా తీరంలో పైరేట్లు రెచ్చి పోతున్నారు. బ్రెజిల్‌ నుంచి బహ్రెయిన్‌ వెడుతున్న వాణిజ్య నౌకను సోమాలియా పైరేట్లు హైజాక్‌ చేశారు. అందులోని భారత్‌కు చెందిన 15మందిని భారత నౌకా దళం రక్షించింది. ఈ హైజాకింగ్‌ గురించి బ్రిటన్‌కి చెందిన యూకె మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ తెలిపింది. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా, ఇజ్రాయెల్‌సహా 12 మిత్రదేశాలు తీవ్ర హెచ్చరిక చేసినప్పటికీ హౌతీలు ఖాతరు చేయకపోవడం ఇజ్రాయెల్‌పై వారి ఆగ్ర హం పరాకాష్టకు చేరిందనడానికి నిదర్శనం . దాడులను ఆపక పోతే తమ సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి ఉంటుందని పన్నెండు దేశాలూ హౌతీ ఉగ్రవాదులను హెచ్చరించా యి. ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఎర్రసముద్రం, అరేబియా సముద్ర జలాల్లో సరకు రవాణా నౌకలపై దాడులు పెరగడంతో కార్గో నౌకలను కేప్‌ఆఫ్‌గుడ్‌హోప్‌ గుండా తరలిస్తున్నారు. వాటివల్ల నౌకల ప్రయాణ దూరం పెరగడం, అధిక వ్యయం కావ డంతో సరకుల ధరలను పెంచేస్తున్నారు.

హౌతీల దాడు ల కారణంగా నిత్యావసరాల రవాణా చార్జీలు పెరుగుతు న్నాయని పాశ్చాత్య దేశాలు బహిరంగంగానే ప్రకటిస్తు న్నాయి. ఫ్రాన్స్‌కి చెందిన సిఎంఎ-సి. సిజీఎం సంస్థ రవాణా చార్జీలను వంద శాతం పెంచింది. హౌతీ ఉగ్ర వాదుల లక్ష్యం అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు. అయితే, ఆ రెండు దేశాలతో వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్న దేశాలకు చెందిన నౌకలపైన కూడా హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. హౌతీ ఉగ్రవాదుల దాడులు పెరిగి పోవడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా నిస్సిగ్గుగా మద్దతు ఇవ్వడమేనని పలు దేశాలు ఆరోపిస్తు న్నాయి. ఇజ్రాయెల్‌ని కట్టడి చేయడానికి అమెరికా ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ దేశాలు పేర్కొంటున్నాయి.

హమాస్‌ దళాలకు హౌతీ ఉగ్రవాదు లే కాకుండా, అరబ్‌ దేశాల్లోని తీవ్రవాద సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. హమాస్‌ని అవి బహిరంగంగానే సమర్ధిస్తున్నాయి. హౌతీ ఉగ్రవాదుల దాడుల్లో ఇంత వరకూ ప్రాణనష్టం జరిగినట్టు సమాచారమేదీ లేదు కానీ,ఆస్తి నష్టం బాగా ఎక్కువగా ఉంది. ఐక్యరాజ్య సమితి అభ్యర్థననుకూడా హౌతీ ఉగ్రవాదులు ఖాతరు చేయడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement