Thursday, May 16, 2024

సుఖదుఃఖాలకు హేతువు…మనసు!

సర్వసాధారణంగా మనమందరం సుఖాలే కోరుకొంటాము. కావాలని కష్టాలను, దు:ఖాన్ని తెచ్చుకోరు కదా! మరి మనం ఈ సుఖ దు:ఖాల వలయంలో చిక్కుకొని జీవనాన్ని సాగిస్తున్నాము. సుఖము, దు:ఖము కావాలని ఎవరూ కల్పించరు. అవి మనం చేసే కర్మల ఆధారంగానే సుఖదు:ఖాలు కలుగుతాయి.
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడుకి ఉపదేశిస్తూ-
”సుఖ దు:ఖే సమే కృత్వా లాభా లాభే జయా జయో
తతో యుద్ధాయ యుజ్య స్వ నైవం పాపమవా వాప్య్ససి!!”
అంటే ”సుఖ దు:ఖాల యందు లాభ నష్టాలు యందు, జయాపజయాలయందు సమ బుద్ధితో వ్యవహరించాలని, అప్పుడే యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము” అంటూ బోధించా డు. ఈ విషయం మనకందరికీ కూడా బోధించినట్లే.
సేనజితుడు అనే రాజు తన పుత్రుడు మరణిస్తే, ఆర్తితో దు:ఖిస్తూ ఉంటే తన మిత్రుడు, యోగి, వేదపండితులు, విప్రుడు వచ్చి, అతనికి హతబోధ చేసాడు.
దు:ఖాలు కలిగినప్పుడు విలపించడం, ఏమిటి? ఈ సృష్టిలో ప్రతీ జీవికి సుఖ — దు:ఖాలు కలుగుతూనే ఉంటాయి. ఏదీ శాశ్వతంగా ఉండదు. పుట్టిన ప్రతీ ప్రాణి మరణించ క తప్పదు కదా! ఆలోచించి చూస్తే నీ కొడుకు ఒక్కడికే మరణం సంభవించినట్లు బాధపడ డం, దు:ఖించడం మూఢత్వం అవుతుంది. నువ్వు ఈ దు:ఖాన్ని విడిచి పెట్టు. ఓ! రాజా! నదికి వరద వచ్చిన సందర్భంలో ఒక కర్ర వచ్చి మరో కర్రను చేరుకుంటుంది. ఆ కలయిక ప్రవాహం ఉన్నంతవరకు మాత్రమే. ప్రవాహం తగ్గిపోతే ఆ కర్రలు విడిపోతాయి.
కలయిక ఎంత సహజంగా జరిగిందో… ఎడబాటు కూడా అంతే సహజంగా జరుగు తుంది. ఇది ప్రకృతి ధర్మం. నిండు మనస్సుతో ఈ భూమి మీద సంబంధ బాంధవ్యాలను కూడా ఆ కర్రల కలయికలా చూడాలి. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు.
”రాజా!
”సుఖస్యానంతరం దు:ఖం దు:ఖస్త్వానన్తరం సుఖం
సుఖ దు:ఖే మనుష్యాణాం చక్రవత్పరి వర్త త:
సుఖాత్త్వం దు:ఖ మాపన్న: పునరా పృత్స్య సే సుఖమ్‌
న నిత్యం లభతే దు:ఖం స నిత్యం లభతే సుఖమ్‌”
ఈ విషయం మనకు తెలియనిది కాదు. సుఖ దు:ఖాలు ఒకదాని తర్వాత మరొకటి సంభవిస్తుంటాయి. ఏదీ శాశ్వతం కాదు. అందుకే సుఖం కలిగితే సంతోషాన్ని, సంతాపాన్ని కాని పొందకుండా ఉండాలి. మానవులకు మనస్సు నుండే ఈ సుఖ దు:ఖాలు అనుభవం లోకి వస్తాయి. అందుకే ”మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో:” అనే ఉపనిషత్తు వివరిస్తోంది. జ్ఞానాజ్ఞానాలు మనసుకు చెందినవే కాబట్టి, మనసులో స్వసంతానమైనా, బంధువుల్ని, ఇతర పామరులైనా, మమకారం, ప్రేమ ఏర్పడకుండా నిగ్రహంచుకోగలిగి తే, వారితో ఎడబా టు సంభవించినా ఏ శోకము ఉండదు. మానవుడు ‘ఇది నాది’ అనే భావం తో ఏ పదార్థం నైనా, ఏ వస్తువు పట్లనైనా, తన మనసులో నిలుపుకొంటాడో అవి చేతనమైనా, అచేతనమైనా అనేక వాసనలను, కోర్కెలు భావాజనితమైన సంస్కారములను, మనసు ప్రేరేపిస్తుంది. రాజా! నువ్వు అనుకోవచ్చు ఈ సుఖ దు:ఖాలు ఎందుకు ఏర్పడాలి? అని. పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలు మిగిలి ఉంటే, అవి తప్పక ఈ జన్మలో అనుభవించి తీరాలి. ఈ కర్మల అనుభవంలో పండితులైనా, పామరులైనా, రాజైనా ఎవరైనా ఒక్కటే. వాటికి నివారణౌషధం ”ధీరత్త్వం” స#హనాలే. పింగళ అనే వేశ్య తన ప్రియుడు కొరకు ఎదురు చూసి చూసి, చాలా సమయం గడిచింది. అయినా అతడు రాలేదు. అపుడు తనలో అనుకొంది. ”నేను నా ప్రియుడు కోసం వేచి చూసి పిచ్చిదాన్ని అయ్యాను. అయితే నాకీ పిచ్చి కామం వల్లనే కదా. నా ప్రియుడుకి వచ్చే వీలుంటుందా లేదు. ఉంటే వచ్చేవాడే కదా. కావున ఈ భ్రమను వదులుకొని, ఒంటి స్థంభంతో కప్పబడియున్న ఈ నా శరీరం అనే ఇంట్లోని తొమ్మి ది వాకిళ్ళు బాగా మూసుకొని నిద్రపోతాను. తృప్తితో భగవంతుని స్మరిస్తూ మనసున ఏ మోహం లేకుండా ఉంటే సుఖాలు అవే కలుగుతాయి. మనిషి ఓటమి పాలు కావడానికి కారణం కోరికలే. మనిషి వినాశనానికి ఆశ ఒక్కటే హతువు. నేను ఆశను వదిలి, వినాశనానికి దూరంగా జీవిస్తాను.” అంటూ మన: ప్రవృత్తిలో శాంతంగా నిద్రపోయింది. నీలో కలిగిన దు:ఖాన్ని, దు:ఖానికి హతువైన మోహా న్ని, వదిలిపెట్టి, వేరే ఆలోచన లేకుండా ప్రజా రంజకంగా పరిపాలన సాగించు. అప్పుడు అన్నీ సుఖాలే గోచరిస్తాయి సుమా.” అని వివరించే సరికి, సేనజితుడు మహారాజు, దృష్టి మరల్చి, సుఖంగా జీవించసాగాడు.
రాజు కోరిక మేరకు ఆయన మిత్రుడు, యోగి మరికొన్ని రోజులు ఉపదేశాన్ని అందిం చాడు. మనకైనా సుఖ-దు:ఖాలు కలుగుతున్నాయంటే మనలోని కోరికలు వల్లనే. అందుకే మన:క్లేశాన్ని మాని, శాంతితో జీవించడం అలవాటు చేసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement