Sunday, May 12, 2024

సత్య విశిష్టతను తెలిపిన శ్రీమద్రామాయణం!

శ్రీరామచంద్ర:- శ్రిత పారిజాత:
సమస్త కల్యాణ- గుణాభిరామ
సీతా ముఖాంభోరుహ చంచరీక:
నిరంతరం- మంగళ మాతనోతు:
శ్రీరామాయణం వేదతుల్యం. రామాయణ పఠనం మనస్సును పవిత్రం చేస్తుంది. పాప నివారణ గావిస్తుంది. పుణ్యఫలాన్ని పెంపొందిస్తుంది. ఆయు రారోగ్యములను ప్రసాదిస్తుంది. సకల వేదాలకు సాటియై నిలుస్తుంది. ఈ రా మాయణం పఠించి క్రమంగా పండితులు- రాజులు ధన సంపన్నులూ మహాత్ము లైనవారెందరో ఉన్నారు.
అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు- జగదభిరాముడు- షడ్గుణౖశ్వర్య సంపన్నుడూ- పితృవాక్య పరిపాలకుడూ- ఏకపత్నీవ్రతుడు- ధర్మమూర్తి- జనహితుడు- త్యాగమయ జీవి- సత్యమునే ప్రాణంగా భావించేవాడు. శ్రీరామా యణంలో రామచంద్రుని సత్యనిష్ట యుగయుగాలకూ ఆదర్శప్రాయమై నిలు స్తుంది. సత్యమే శ్రీరాముని ప్రాణం. ఆయన మార్గమే రామాయణమై చరిత్రలో స్థిరమై నిలిచియున్నది. సుగుణాభిరాముడైన రామచంద్రుని సత్యనిష్టను తెలు సుకొని ఆనందిద్దాం.
వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో ఒక పద్యంలో
కం|| సత్యదయా రూపకమయి
నిత్యంబుగ రాజవృత్తి నెగడున్‌గానన్‌
సత్యాత్మక మీ రాజ్యము
సత్యంబేకుదురు- సర్వజగములకెపుడున్‌||
అంటూ రాజు యొక్క జీవనానికి నిత్యమూ ఆధారమైనవి సత్యమూ- దయలే. లోకం యొక్క ఆత్మ- సత్యం. కావుననే అన్ని లోకాలకూ కుదురు ఒక్క సత్యమే. మరొక పద్యంలో
కం|| సత్యంబే శ్రేష్ఠమని- యా
దిత్యులు- మునిపుంగవులును- దెలుతురు సతమున్‌
సత్యంబు బలుకువాడే
సత్యంబుగ పరమ పదము- జాలుం బొందన్‌
దేవతలు- మునులు- సత్యమే శ్రేష్ఠమైనదని నిరంతరమూ కీర్తిస్తున్నారు. పరమపదం దక్కేది సత్యం మాటాడేవాడికే. ఇది నిత్య సత్యం. సత్యం వల్లనే సంపదా- ధర్మమూ చేకూరుతాయి. స్వర్గం లభించేది సత్యం వల్లనే సుమా!
కం|| సత్యముననుండులక్ష్మియు
సత్యంబన యీశ్వరుండు- జగములకెల్లన్‌
సత్యము మూలంబంతకు
సత్యంబున కంటె లేదు– శాశ్వత ముదమున్‌||
లక్ష్మీదేవి ఉండేది సత్యంలోనే. లోకాలన్నిటినీ నియమించేది సత్యమే. సక లానికీ మూలమైనది సత్యమే. సత్యం కంటే శాశ్వతమైనది ఏదీలేదు. సత్యం విశిష్ఠతను రామాయణం మరో పద్యంలో-
కం|| దానంబును వేదంబును
ధ్యానము- హోమంబునిష్ఠ-తపమిష్టంబున్‌
మానక సత్యాశ్రయముట
కాననరుడు సత్యపరుడు గావలయుజుమీ|| అంటూ వాల్మీకి మనోజ్ఞంగా వర్ణించారు. దానము- వేదమూ-ధ్యానమూ- హోమమూ- నిష్ఠ- తపస్సు- యాగమూ ఇవన్నియు సత్యం మీదనే ఆధారపడియున్నది. కావున మానవుడు సత్యాన్ని తప్పకూడదు. మరో పద్యంలో రామాయణం యిలా తెలిపింది.
కం|| ధరకీర్తియశోలక్ష్ములు
పురుషున్‌ సత్యైక నిష్ఠు- బొందునుదమిచే
సురభూమి కరుగు దోడుగ
బురుషుడు సత్యంబునెట్లు షోకార్పదగున్‌||
సత్యం తప్పని నిష్టతో ఉన్న మనిషికి కీర్తి- యశస్సు- సంపద తమంత తా ముగ వచ్చి చేరుతాయి. స్వర్గలోకానికి ఈ సత్యం తోడుగా పోయి వుంటుంది. ఈ విషయం జీర్ణించుకున్న మనిషి సత్యాన్ని తప్పదు.
శ్రీరాముడు భరతునికి సత్యనిష్ఠను దెల్పుతూ!
”నాయనా భరతా! చంద్రుడి నుండి లక్ష్మి తొలగినా సరే! హిమాలయం నుం డి మంచుపోయినా సరే, చెలియలి కట్టదాటి సముద్రం ఈ విశ్వాన్ని ముంచెత్తినా సరే! ఈ రామచంద్రుడు మాత్రం తండ్రి చెప్పిన సత్యవచనాన్ని తప్పడు” అంటూ ఒక పద్యంలో వాల్మీకి యిలా తెలిపాడు.
ఉ|| పాయును గాక లక్ష్మి- హిమ భాను మనోహర మండలంబునున్‌
పాయును గాక- మంచుహిమవన్నగ రాజమునుండి-వేలనే
పాయును గాక- సాగరము విశ్వము ముంపగ-రామచంద్రుడన్‌
నాయన! తండ్రి సత్యవచనంబు -దప్పడు-మాటలేటికిన్‌
అని ప్రియ సోదరుడు భరతునికి శ్రీరాముడు సత్యం విశిష్టతను తెలిపాడు.
సత్యమహిమను గోపీనాథ రామాయణంలో యిలా తెలిపారు.
కం|| సత్యమునగలుగు బరమును
సత్యము నందుండు- ధర్మసంచయ మెల్లన్‌
సత్యంబె శ్రుతులు- బ్రహ్మము
సత్యేతరమైన దొకటి- జగతింగలదే|| అంటూ
సత్యం వల్లనే పైలోకాలు దక్కుతాయి. సకల ధర్మాలూ సత్యాన్నే ఆశ్రయిం చుకొని ఉంటాయి. సత్యమే వేదాలు- సత్యమే పరబ్రహ్మం ఈ జగత్తులో సత్యం కానిదంటూ ఏమీ లేదు. ఈ రీతిగా రామాయణంలో శ్రీరాముడు పలు సందర్భా లలో సత్యనిష్ఠను దాని వైశిష్ట్యాన్ని తన భక్తు లకూ, పలు పాత్రలకూ వర్ణించి ఆదర్శ పురు షుడైనాడు. సత్యం మహిమ వర్ణింపరానిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement