Thursday, May 16, 2024

విశ్వంలో మొదటి శబ్దం ప్రణవము

నవవిధ భక్తి మార్గములో కీర్తనము ఒకటి. భగవంతుని కీర్తించుటకు అనేక నామ ములను సమర్పించుకొందురు. అష్టోత్తరము, సహస్రనామము మొదలగు స్తోత్రములను పఠించుచు తన్మయత్వమును పొందుట పరిపాటి. అయితే ప్రతి నామము నకు ముందు ప్రణవమును జతచేసిన కాని అది మహిమను ఆపాదించుకొనదు. కావున ప్రతి నామమునకు ముందు ఓంకారముతో ప్రారంభించి సంపూర్ణము గావింపవలెను. ప్రణవమును అనేక ఉపనిషత్తులలోను, పురాణములలోను ప్రస్తావించుట జరిగినది. ఈ అనంత విశ్వము ఓంకారమనే విస్ఫోటనము నుండి జనించినదని పేర్కొనుట జరిగినది. భూభ్రమణము కూడా ఓంకారముతోనే జరుగుచున్న దని తెలిపియున్నారు. అనగా ఈ బ్రహ్మాండము శబ్దము ఓంకారమని భావించవచ్చు. అటువంటి మహ త్తరమైన ప్రణవమును మంత్రముగా స్వీకరించి యోగ సిద్ధిని పొందినవారు అనేకులు మనకు సనాతన వాఙ్మ యములో కనబడును.
ఈ ఓంకారము త్రిమాత్రా సస్వరము. అ, ఉ, మ అను మూడు స్వరములతో గూడినది. మొదటిది ‘అ’ వైద్యుతి. అనగా విద్యుత్‌ సంబంధమైనది. శక్తిమయ మయిన మెరుపు నుండి జనించినది. ‘ఉ’ అనునది తామసి. అనగా ఈ అనంత విశ్వములో కాంతి ఎంత గలదో చీకటి కూడా అంతే కలదు. చీకటి మయమయిన తామసి కూడా అనంత శక్తిమయమయినది. ఇక మూడవది ‘మ’ నిర్గుణి. యథార్థమునకు ఈ అనంత పరిబ్రహ్మము నిర్గుణ స్వరూపిణి. కనబడునది అంతయూ భావనామయము కావున దానిని నిర్గుణి అని పేర్కొన్నారు. ఎవరైతే ఈ ఓంకారమును మంత్రముగా జపిం తురో వారు యోగసిద్ధిని పొంది యోగిగా పూజింపబడుచున్నారు.
‘అ’ అక్షరము. క్షరముకానిది. నాశనములేనిది. దీనినే ‘భూ’ అని, రసాతలమని, భూ లోకమని భావింతురు. ‘ఉ’ ఇది సంగీతమయమయినది. అందువలన దీనిని స్వరితము అన్నారు. దీనిని భువ: అని భావించారు. అనగా అంతరిక్షము. ఇక ‘మ’ దీనిని ప్లుతము అన్నారు. అనగా సమానవేగముగా ఉచ్చరించునది. సమవేగముతోపోవు అశ్వము వంటి వేగము గలది. దీనినే సువ: అని భావించారు. అనగా స్వర్గ లోకము. ఈ వర్ణన ప్రకారము ఓంకారము అనంత విశ్వవ్యాప్తమయము అని భావించవచ్చు.
ఓంకారమును ధనస్సుగా భావించిన ఆత్మ బాణమగును. లక్ష్యము పరబ్రహ్మ. కావున ఎవరైతే ఓంకారమను ధనస్సును చేతబట్టి ఆత్మ అనుశరమును యోగసిద్ధిచే పరబ్రహ్మ వైపుకు గురిపెట్టి చేరినచో వారు బ్రహ్మమయుడు అగును. ప్రణవము అక్షరము. నాశన ములేని శాశ్వత బ్రహ్మ. దీనిని మూడు లోకములుగా పైన భావించుట జరిగినది. శిరస్సు స్వర్గము, బ్రహ్మకు సంబంధించినది. ఇక అంతరిక్షముగా భావించినది రుద్రలోకము. రసా తలముగా భావించినది శివస్థానము అనికూడా పేర్కొనుట జరిగినది. ‘అ’ అనునది హ్రస్వ మాత్ర అనగా అతి స్వల్పకాలమున ఉచ్చరించునది. ‘ఉ’ అనునది దీర్ఘకాలము ఉచ్చరించు నది. వు అనునది ప్లుతవతి అనగా సమాన కాల వ్యవధిలో ముగింపుతో కూడిన ఉచ్చారణ. దీనిని ఎవరి శరీర శక్తిని బట్టి పూర్తి శ్వాసను ప్రణవము గా, అనగా ఓంకారమును ఉచ్చరించవలెనని తెలియ చేసారు. ‘అ’ తో మొదలుపెట్టి ‘ఉ’ తో కొనసాగించి ‘మ’ తో ముగించవలెనని భావించడం జరిగింది. ఆత్మ యందు ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఎల్ల ప్పుడూ ధ్యానము చేయుచూ ప్రణవమును అభ్యాస ము చేయువారును, శ్రవణము చేయువారును అశ్వ మేధ యాగము చేసినంతటి పుణ్యఫలమును పొందు దురని సనాతన ధర్మము తెలియచేయుచున్నది.
ఓంకారమును మనముందునందు కొనసాగిం చు గృహస్థు చేసిన కర్మలనియూ సఫలమగును. ఓంకారమును అక్షర పరబ్రహ్మ రూపముగా తెలుసు కున్నవారు, ధ్యానము చేసినవారు సంసార చక్రమును వదలి బంధనములు లేనివారై నిస్సంశయముగా అచలమును, నిర్గుణమును అయిన శివస్థానమును పొందగలరని వాయుపురాణము తెలియచేయుచున్నది. విశ్వమంతయు వ్యాపించిన యజ్ఞము. యజ్ఞమే వేదములై వెలుగొందిన ఈ పృథివిపై ప్రణవమును మించిన మంత్రము లేదు.
తైత్తిరీయ ఉపనిషత్తు చెప్పినట్లు శిక్షావల్లిలో ప్రణవ ధ్యానం ఉన్నతమైనది. ఓం అను నది ఒక విశ్వ ప్రకంపన. ప్రణవము పరమాత్మచేత విశ్వానికి అందించబడిన మొట్టమొదటి శబ్దం. ఇది సంపూర్ణమైన శబ్దం. భగవంతుని పిలవడానికి భగవంతునిచే సృజించబడిన నామము ఓం కారము. ప్రణవ ధ్యానం అలౌకిక సార్వత్రిక శబ్దపఠనం. ఓంకారము బ్రహ్మాం డము నుండి జనించిన విశ్వ కంపనము కనుకనే సర్వవ్యాధులను, రుగ్నతలను పంచభూత మయమైన దేహమున నిరో ధించుచున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement