Tuesday, May 14, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 19

19.
భూతగ్రామ: స ఏవాయం
భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్య్రాగమేవశ: పార్థ
ప్రభవత్యహరాగమే ||

తాత్పర్యము : బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనపుడు జీవులు మరల మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశులై నశింతురు.

భాష్యము : ఈ జగమునందు జీవితము మెరుగు పరుచుకోవాలనే బుద్ధిహీనులు స్వర్గలోకాలకు ఉద్ధరింపబడి మరల పుణ్యము తరిగినంతనే తిరిగి భూమిపైకి వచ్చుదురు. ఇలా బ్రహ్మయొక్క పగలు అనగా వెయ్యి చతుష్‌యుగాలు గడచినంత, బ్రహ్మ యొక్క రాత్రి మొదలయ్యే సమయమున ప్రళయము సంభవించి, జీవులందరూ విష్ణువు యందు ఉంచబడుదురు. మరలా పగలు మొదలైనపుడు, జీవులు వారి వారి కోరికలనునుసరించి వేరు వేరు శరీరాలను తీసుకొని భౌతిక జీవితాన్ని కొనసాగించుదురు. ఆ విధముగా బ్రహ్మజీవిత కాలము పిదప ప్రళయము సంభవించి కోటాను కోట్ల సంవత్సరాలు అవ్యక్తస్థితిలో ఉండిపోవుదురు. మరలా బ్రహ్మజన్మించినంతనే వారి భౌతిక జీవితము, వేరు వేరు జన్మలు, శరీరాలు పొందుతూ ఇలా ఈ భౌతిక ప్రపచపు మాయాజాలములో చిక్కుకొని పోవుదురు. అదే బుద్ధిమంతులు ‘ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే ‘నామ ఉచ్చరణతో కృష్ణచైతన్య సాధన చేయుచూ ఈ జన్మలోనే కృష్ణుని సాంగత్యాన్ని, నిత్య ఆనంద స్థితిని అనుభవించుచూ జన్మమృత్యు చక్రానికి అతీతులుగా ఉందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement