Sunday, May 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 3
23.02.17

3
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి
సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రజ్ఞయో: జ్ఞానం
యత్తద్‌ జ్ఞానం మతం మమ ||

తాత్పర్యము : ఓ భరతవంశీయుడా ! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము.

భాష్యము : ప్రతి క్షేత్రము నందు, అనగా ప్రతి శరీరము నందు రెండు ఆత్మలు ఉంటాయి. ఒకటి ఆత్మ అయితే మరొకటి పరమాత్మ. ఆ పరమాత్మ దేవాది దేవుడైన శ్రీ కృష్ణుని విస్తార రూపము. ఆ విధముగా శ్రీ కృష్ణుడు పరమాత్మగా వేరు వేరు జీవరాశుల శరీరాల యందు నివసిస్తూ అన్ని శరీరముల గురించి సమస్తమును తెలుసుకొనును. ఒక పౌరునికి తన భూమి గురించిన అన్ని వివరాలు తెలిసి ఉండవచ్చు. అయితే రాజుకు అందరి పౌరుల భూములను గురించిన వివరాలు తెలిసి ఉండును. అదేవిధముగా జీవుడు తన శరీరానికి యజమాని అయితే భగవంతుడు అందరి శరీరాలకు యజమాని, శరీరము, ఆత్మ, పర మాత్మల వాస్తవ స్థితిని తెలుసుకొనుటయే జ్ఞానమనబడుతుందని వేదాలు తెలియజేయుచున్నవి. ఇదే శ్రీ కృష్ణుని అభిప్రాయము. ఈ భౌతిక ప్రపంచము, లేదా క్షేత్రము ప్రకృతి అయితే, ఆ ప్రకృతిని అనుభవించుటకు ప్రయత్నించేది జీవుడు మరియు వారిద్దరినీ నియంత్రించేది సర్వ క్షేత్రజ్ఞుడైన శ్రీ కృష్ణుడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement