Sunday, October 13, 2024

ధర్మం – మర్మం : నాగుల చవితి విశిష్టత (ఆడియోతో…)

నాగుల చవితి విశిష్టతను గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ..

ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రమలు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.

జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తిక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తికమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తికమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తిక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధించాలి. చవితి అం టే నాల్గవది అనగా ధర్మార్థకామమోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగుల చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం :

- Advertisement -

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవి స్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement