Thursday, May 16, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 8

8. నీతో యుద్ధము చేయనోప గవితా నిర్మాణ శక్తి న్నినున్
బ్రీతుం చేయగా లేను, నీ కొరకు తండ్రిం జంపగా జాల నా
చేతన్ రోకట నిన్ను మొట్ట వెఱతున్ చీకాకు నా భక్తియే
రీతి న్నాకిక నిన్ను జూడగ నగున్ శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నేను నీతో యుద్ధం చేయలేను. కవిత్వం చెప్పి నిన్ను మెప్పించ లేను. నీ పై భక్తితో తండ్రిని చంప లేను. చేతిలో ఉన్న రోకలితో నిన్ను కొట్ట లేను. నా భక్తియే నాకు చికాకు కలిగిస్తూ ఉంది. ఇవేవీ చేయలేకపోతే నిన్ను నేనెట్లా చూడగలను?
విశేషం: ఈ పద్యంలో నాల్గు పూర్వగాథలని సూచించటం జరిగింది.
1 యుద్ధం: పాశుపతాస్త్రం కొఱకు అర్జునుడు తపస్సు చేస్తూ ఉండగా శివుడు అతడిని పరీక్షించటానికి పందిని తరుముతూ కిరాతవేషంలో వచ్చాడు. శివుడు, అర్జునుడు ఇద్దరూ ఒకేసారి ఆ అడవిపందిని బాణాలతో కొట్టారు. అది చనిపోయింది. అది నా దంటే నాది అని ఇరువురూ యుద్ధం చేశారు. శివుడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చుకుని వరంగా పాశుపతాన్ని ప్రసాదించాడు.
2. కవిత్వం: పాండ్యదేశంలో కరవు వచ్చినప్పుడు మూలస్థాన హరద్విజుడు మధురానగరాన్ని వదలి వెడుతుండగా, శివుడు అతడి కొక పద్యం రాసిచ్చి, రాజాస్థానంలో చదివితే రాజు ధనం ఇస్తాడని చెప్పాడు. ఆస్థాన కవులలో ఒకడైన నత్కీరుడు ఆ పద్యంలో తప్పు పట్టగా ఆ బ్రాహ్మణుడు అవమాన భారంతో తిరిగి వస్తాడు. అప్పుడు శివుడు తానే అ సభకి వెళ్ళి పద్యంలో తప్పేమిటి? చెప్పమని అడిగి, దానికి వివరణ మిచ్చిన తరవాత కూడా నత్కీరుడు వాదించగా అతడిని శపించి, ఆ పై అనుగ్రహించాడు.
3. తండ్రిని చంపటం: తాను వద్దన్నా కొడుకు శివపూజ చేస్తున్నాడని తండ్రి శివ లింగాన్ని తన్నగా, కొడుకు కోపించి తండ్రిని చంపాడు. ఇది ఒక వీరభక్తుడి గాథ.
4. ఒక శివభక్తురాలి ఇంటికి శివుడు బ్రాహ్మణవేషంతో వచ్చి, భోజనం పెట్ట మని అడిగాడు. ఆమె అతడికి పెట్టినా ఆహారం శివప్రసాదమని పారవేయ కూడదు అంది. అతడా పదార్థాలు రుచిగా లేవని వదలి పెట్టగా, శివప్రసాదాన్ని చులకన చేశాడు అనే కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి రోకలితో బాదింది. శివుడికి ఆ దెబ్బలు కూడా ప్రీతిపాత్రాలే.
ధూర్జటి ఆ కథలని గుర్తు చేసి, తాను వారి వలె చేయలేను అని వారి భక్తి తీవ్రతను మెచ్చుకున్నాడు.
పరమేశ్వరుడి దర్శనం కలగటానికి తన భక్తియే తనకు అడ్డు వస్తోంది అంటాడు ధూర్జటి. భగవదనుభూతికి ఈ భక్తి అడ్డుతగలటం సహజమే. నేను, నాభక్తి, నాదైవం అనే మూడు భావాలు ఉన్నంత కాలం సమాధి స్థితి లభించదు. ఈ మూడు భగవంతుడి యందు లయించినప్పుడు భక్తుడికి, భగవంతుడికి భేదం ఉండదు. భక్తియే శివుడు. శివుడే భక్తుడు. ఈ స్థితి రావటానికి అడ్డు తగిలే ఆరాటం, ఆవేదనలతో కూడిన భక్తి కూడ కఱగి పోవాలి. భక్తులందరి జీవితాలలో దీనికి తగిన సంఘటనలు చోటు చేసుకుంటాయి అనుగ్రహించటానికి ముందు. త్యాగరాజు పూజించే అర్చామూర్తులు దూరం కావటం ఇటువంటిదే. ఒక్క మూర్తి యందే భగవంతుడనే నిష్ఠ ఉండటం భక్తిని, భగవంతుడి అనంతత్త్వాన్ని పరిమితం చేయటమే కదా.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇది కూడా చదవండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 7

Advertisement

తాజా వార్తలు

Advertisement