Saturday, April 27, 2024

బద్రీనాథ్‌ యాత్రకు బ్రేకే

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. 13 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో బద్రీనాథ్‌ యాత్రకు బ్రేక్‌ పడింది. వర్షాల కారణంగా యాత్రను పండుకేశ్వర్‌ వద్దే నిలిపివేస్తున్నట్లు చమోలి అధికార యంత్రాంగం వెల్లడించింది. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా యాత్రికులం తా జోషిమఠ్‌, పాండుకేశ్వర్‌ వద్దే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ కలెక్టర్‌ హమాన్షు ఖురానా విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఆదేశాలు జారీ చేశారు. పౌరులు ఈ రెండు రోజులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ చమోలీ జిల్లాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హమనీ నదంలో నుంచి భారీ మంచు పెళ్లలు విరిగి ధౌలిగంగాలో పడటంతో పెద్దసంఖ్యలో స్థానికులు గల్లంతయ్యారు. ఎస్‌డీఆర్‌ కమాండెంట్‌ నవనీత్‌ సింగ్‌ తమ బృందాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీచేశారు. సాధారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు వంటి వాటివల్ల ప్రాణ, ఆస్తినష్టం ఏర్పడుతుంది. అటువంటి విపత్తుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ 29 బృందాలు రాష్ట్రవ్యాప్తంగా మోహరించబడ్డాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం దాకా గోపేశ్వర్‌లోని నందాదేవి బయోస్పియర్‌ రిజర్వు అటవీ ప్రాంతంలోకి అన్ని ట్రెక్కింగ్‌ క్యాంపింగ్‌, పర్వతారోహణ బృందాలు నిషేధించబడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement