Saturday, April 27, 2024

ఆధ్యాత్మజ్యోతి ఆత్మజ్యోతి

”సవా ఏష మహానజ ఆత్మా జరోమరోమృతో భయో బ్రహ్మా
భయం హివై బ్రహ్మ భవతియ ఏవం వేద
(బృహదారణ్యకోపనిషత్తు -4-4-25) .
అంటే ఆత్మ గొప్పది. జన్మ రహితమై అజరామరమైన అమృత అభయ స్వరూపమైనది అని అర్థం. ఇది తెలిస్తే వ్యక్తి అభమ బ్రహ్మ మవుతాడు. ఇలా అంతటా ఉన్నది పరమాత్మే అని తెలిపేదే ఆధ్యా త్మ విద్య. దీపాన్ని జ్యోతి అని కూడా అంటారు. ఆధి భౌతిక, ఆధి దైవిక, అధ్యాత్మ అని జ్యోతులు మూడు రకాలు. ఇంటిలో , గుడిలో, ప్రమి దలో వత్తి వేసి, నూనె పోసి మనం వెలిగించే దీపము, విద్యుద్దీపం వంటివి ఆధి భౌతిక దీపాలు. అంటే మనకు తెలిసి బాహ్య ప్రపంచం లో సాధారణ చీకటిని తొలగిం చి కాంతి నిచ్చేవి.
మామూలు దీపం వెలిగించబడనప్పుడు లేదా అది ఆరి పోయినప్పుడు చంద్రుడు, నక్షత్రాలు దీపాలుగా భావించబడతా యి. పగటి వేళ సూర్యుడే మనకు జ్యోతిగా వెలుగునిస్తాడు. ఇది దేవతా సంబంధమైన దీపాలు. అందుకే వీటిని ఆధి దైవిక జ్యోతులు అన్నారు. ఇవిగాక మన దేహంలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే జ్యోతులు ఉన్నాయి. వెలుగుతో మనకు ప్రపంచాన్ని కని పించేలా చేసే జ్యోతులు ఇంద్రియాలు. వీటిని వెలిగించే జ్యోతి మన స్సు. మనస్సుకు బుద్దియే జ్యోతి. అయితే ఆ బుద్దిని ప్రచోదింప చేసేది, ప్రకాశ పరచేది మన ఆత్మ, ఇలాంటి జ్యోతులను అధ్యాత్మ జ్యోతులు అన్నారు.
జనక మహరాజుకు, యాజ్ఞవల్క్య మహర్షికి జరిగిన సంభాష ణ బృహదారణ్యకంలో వివరించబడింది. జనకుడు అడుగు తాడు ”యాజ్ఞ వల్క్య! ఈ పురుషునికి జ్యోతి ఏది?” యాజ్ఞవల్కుని జవా బు ”ఆదిత్యుడే (సూర్యుడు) జ్యోతి.అతని వెలుతురు వలన ఇతడు వ్యవహరిస్తున్నాడు. ”కాని ఆదిత్యుడు అస్తమించినప్పుడు?” ఆరి పోతే? ”వాక్కు చీకటిలో మాటలను బట్టి అనుసరిస్తాడు.” ఒక వేళ ఆదిత్యాదులు వాక్కు లేనప్పుడు?” అప్పుడు ఆత్మయే జ్యోతి. ఆత్మ అనే వెలుగులో కూర్చోవడం, నడవడం, పని చేయడం వంటి వ్యవహారాలు సాగుతాయి.
శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఒక మారు నడుచుకొని వెళు తుండగా ఒక కుష్టు రోగి తారసపడ్డాడు. ఆ రోగిని ఉద్ధరించాలని శంకరులకు అనిపించింది. అతని దగ్గరకు వెళ్ళి ఆయన ”కిం జ్యోతి స్తవ?” అని అడిగారు. అప్పుడు ఆ రోగి ”భానుమాన హనియే రౌత్రా ప్రదీపాదికంస్యాత్‌’ అని బదులిచ్చాడు. అంటే నాకు పగలు సూర్యుడు, రాత్రి దీపము మొదలైనవి” అని అర్థం. మరలా శంకరా చార్యులు” ఏవం రవి దీప దర్శనవిధౌ కింజ్యోతిఖ్యా హిమే?” అన్నారు. అంటే సూర్యుడిని, దీపాన్ని చూచెటప్పుడు నీకు జ్యోతి ఏది? అని భావం.
”ఛక్షు:” (కన్నులు) అన్నాడు రోగి. మరలా జగద్గురువులు ”తస్య నిమీలనాది సమయేకిం?” అని ప్రశ్నించారు. అంటే కన్నులు మూసుకొనినప్పుడు నీకు జ్యోతి ఏది అని. అప్పుడతను ”ధీ:”(బుద్ది) అని బదులు చెప్పాడు. ” ధియ: దర్శనౌకిమ్‌” మరలా అడిగాడు శంకరుడు. అంటే గాఢనిద్రలో బుద్దియు పని చేయన ప్పుడు నీకు జ్యోతి ఏది అని అర్థం. అప్పుడా రోగి గురుకృపచే” అహం పరమకం జ్యోతి స్త దస్మి ప్రభో” అన్నాడు. కనుక సాక్షియే నిజమైన ఆధ్యాత్మ జ్యోతి.
ఈ ఆధ్యాత్మ జ్యోతి ఎక్కడ ఉంది? జ్యోతిషామపి తజ్యోతి: తమస: పరముచ్యతే! జ్ఞానం జేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్టితమ్‌ భగవద్గీత – 13వ అధ్యాయం- 18వ శ్లోకం) జ్యోతుల కెల్ల జ్యోతియై అందరి హృదయాలలోనూ ఉంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని వంటి వారికి కూడా ప్రకాశమునిచ్చేది. తమస్సు (అజ్ఞానపు చీకటి) కంటే వేరైనది. జ్ఞాన స్వరూపమైనది (చిన్మయ రూపం), తెలియదగినది. జ్ఞాన గుణములచే పొంద దగినది సమస్త ప్రాణుల యొక్క హృదయములందు విశేషించి ఉన్నదని ఈ జ్యోతి అని అర్థం. అయితే సర్వవ్యాపి అయిన ఈ జ్యోతిని హృదయం ద్వారా మాత్రమే జిజ్ఞాసువు గుర్తిస్తాడు. ఎలాగంటే ఆవు శరీరంలో పాలు సూక్ష్మ రూపంలో వ్యాపించి ఉన్నప్పటికీ మనం దానిని పొదుగుద్వారా మాత్రమే పొందుతున్న విధంగా అన్నమాట.
అలాగే అధ్యాత్మ జ్యోతి దేశ, కాల అవస్థాతీతమై ఉన్నప్పటికీ , హృదయం ద్వారానే తెలుసుకొనబడుతుంది. కాబట్టి హృదయం లోనే అధ్యాత్మ జ్యోతియైన ఆత్మ ప్రకాశిస్తోందని శాస్త్ర వాక్యం.
ప్రమిదలో దీపం వెలగాలంటే నూనె, వత్తి వంటివి కావాలి. ఎందుకంటే ఆధి భౌతిక జ్యోతి. సూర్య చంద్రులు, నక్షత్రాలు ఆధి దైవిక జ్యోతులు. ఇవి వెలగటానికి దేశ కాలాలు కావాలి. కాని స్వయంగా ప్రకాశించే శక్తి గల ఆత్మ జ్యోతికి ప్రమిద, నూనె, దేశ కాలాలు అవసరం లేదు. అది తనకు తానే ప్రకాశించే జ్యోతి. దీపారాధన సమయంలో మనం చె ప్పుకునే శ్లోకం ఈ విషయాన్నే ధృవీకరిస్తుంది.
”నతత్ర సూర్యోభాతిన చంద్ర తారకం&
నేమా విద్యుతోభాన్తి కుతోయమగ్ని:
తమేవ భాన్తమను భాతి సర్వం|
తస్యభాసా సర్వ మిదం విభాతి:!! ”
ఆత్మ జ్యోతి తనకు తానే ప్రకాశిస్తూ అంతటినీ ప్రకాశమానం చేస్తూ ఉన్నది. గురూపదేశం వలన ఎరుక కలిగి ఈ జ్యోతి తానేనని ముముక్షువు తెలుసుకున్నప్పుడు అజ్ఞానమనే చీకటి తొలగి పోతుందంటారు అనుభవస్తులు.
”తమస్య పరముచ్యతే” అని భగవద్గీత, ”ఆదిత్య వర్ణం తమస: పరస్తాత్‌” అని శృతి. ఈ జ్యోతి, అవిద్యకు ( చీకటికి) ఆవల వైపే ఉంది అన్నాయి. ఆత్మ జ్యోతిని భయంకరమైన ఈదురుగాలి కానీ, ప్రచండమైన తుఫాన్‌ కాని ఆర్పలేవు.
మహా ప్రళయంలోనూ ఆరిపోని అఖండ అధ్యాత్మ జ్యోతి ఇది. అధ్యాత్మ జ్యోతి అంటే స్వయం జ్యోతి అయిన అనుభవ స్వరూ పమైన ఆత్మయే అని గుర్తెరగాలి. సాధకుని భక్తి తత్పరత వలన భగవంతుడే జ్ఞాన దీపాన్ని వెలిగించి, అవిద్య అనే చీకటిని తొలగి స్తాడని గీత అంటుంది.
”తేషామే వానుకం పార్ద మహా జ్ఞానజంతమ:|
నాశయా మ్యాత్మ భావస్థో జ్ఞాన దీపేన భాస్వతా”||
(భగవద్గీత 10-11) . వేదాంతులు ఈ జ్ఞాన దీపాన్ని ఆత్మ విద్య, బ్రహ్మ జ్ఞానం అంటారు.
”జ్ఞాన దీపేన వివేక ప్రత్యయ రూపేణ భక్తి ప్రసాద స్నేహాభి షిక్తేన మద్భావ నాభినివేశవా తారి తేన బ్రహ్మ చర్యాది సాధన సంస్కార వత్రజ్ఞా వర్తినా, విరక్తాన్త: కరణాధారేణ, విషయ వ్యా వృత్త చిత్త రాగ ద్వేషా కలుషిత నివాతాతవర త స్థేనా నిత్య ప్రవృత్రై కాగ్య్ర ధాన జనిత సమ్యగ్దర్శన భాస్యతా జ్ఞాన దీపెన త్యర్థం!! ( ఆది శంకరులు- గీతా భాష్యం- 10-11) జ్ఞాన దీపానికి భక్తి అనే శుద్ద తైలం,పరమాత్మ భావన అనే గాలి, బ్రహ్మ చర్యాది సాధనలతో సం స్కరింప బడిన ప్రజ్ఞ అనే వత్తి, విరక్తితో కూడిన అంత: కరణమనే ప్రమిదలేక దీప స్థంభం ఉండాలి. ఇచ్ఛా ద్వేష కల్మషం లేక, ఎక్కువగా గాలిలేని గదిలాగా మన స్సు ప్రశాంతంగా ఉండాలి. బయటి ప్రాపంచిక విషయాల నుండి మనస్సు మరలించి ఏకా గ్రతతో దైవ ధ్యానం చేస్తే జ్ఞాన దీపం అనే ఆధాత్మ జ్యోతి ప్రకాశిస్తుంది.

– గొల్లాపిన్ని సీతారామశాస్త్రి
9440781236

Advertisement

తాజా వార్తలు

Advertisement