Monday, May 6, 2024

ఓపెన్‌ ఏఐ సీఈవోగా మళ్లి శామ్‌ ఆల్ట్‌మన్‌..? మైక్రోసాఫ్ట్‌తో చర్చలు.. దిగొచ్చిన బోర్డు

చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ను మళ్లి సీఈఓగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను తొలగించడం టెక్‌ ప్రపంచంలో చర్చకు దారితీసింది. సీఈవోగా ఆయన్నే కొనసాగించాలని ఇన్వెస్టర్లు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాప్ట్‌nతో కొంత మంది ఇన్వెస్టర్లు చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో ఆల్ట్‌మన్‌తో కంపెనీ బోర్డు చర్చిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

ఆల్ట్‌మన్‌ను సీఈఓగా తిరిగి తీసుకురాకపోతే తాము కంపెనీ నుంచి వైదొలగుతామని కొందరు సిబ్బంది బోర్డుకు అల్టిమేటం ఇచ్చారట. మరోవైపు మైక్రోసాప్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల సైతం ఆల్ట్‌మన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తాత్కాలిక సీఈఓ మిరా మురాటికి ఆయన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బోర్డు నిర్ణయం మేరకే ఆయన తన అభిప్రాయాన్ని అలా వ్యక్తపరిచినట్లు చెప్పారు.

కొత్త ఏఐ వెంచర్‌కు ఆల్ట్‌మన్‌ ప్రయత్నాలు..

- Advertisement -

ఇదిలావుంటే, ఆల్ట్‌మన్‌ సొంతంగా ఓ కంపెనీని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన తొలగింపును నిరసిస్తూ వైదొలగిన ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ సైతం కొత్త సంస్థలో భాగమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం శామ్‌ ఆల్టమన్‌ కు ఉద్వాసన పలికిన వెంటనే సంస్థ ప్రెసిడెంట్‌గా గ్రేగ్‌ బ్రాక్‌మన్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఒకవేళ సొంతంగా ఏఐ వెంచర్‌ ప్రారంభించినా శామ్‌ ఆల్టమన్‌ మళ్లి ఓపెన్‌ ఏఐలో చేరే అవకాశాలు ఉన్నాయి.

సీఈవో మార్పుతో ఓపెన్‌ఏఐని వీడిన సైమన్‌ సైడర్‌ సహా పలువురు పరిశోధకులు ఆల్ట్‌మాన్‌ నూతన వెంచర్‌లో చేరతారా అనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. నూతన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హార్డ్‌వేర్‌ డివైజ్‌ను నిర్మించే ప్రతిపాదనపై ఆల్ట్‌మాన్‌, యాపిల్‌ మాజీ డిజైన్‌ చీఫ్‌ జాన్‌ ఐవ్‌ గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. సాప్ట్‌nబ్యాంక్‌ సీఈవొ యసయోషి సొన్‌ కూడా ఈ చర్చల్లో పాలుపంచుకున్నట్టు వార్తలొచ్చాయి. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఆల్ట్‌మాన్‌, బ్రాక్‌మాన్‌లు అందుబాటులోకి రాలేదని ఓ వార్తా సంస్ధ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement