Tuesday, May 14, 2024

మన 5జీ ఇతర దేశాలకు ఇచ్చేందుకు సిద్ధం : నిర్మలాసీతారామన్‌

పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతోనే 5జీ సేవలను భారత్‌ ప్రారంభించిందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. అవసరమైతే ఈ టెక్నాలజీని ఇతర దేశాలకు ఇచ్చేందుకూ సిద్ధమేనని ఆమె ప్రకటించారు. అమెరికా పర్యనటలో ఉన్న నిర్మలాసీతారామన్‌ జాన్‌ హాష్కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ప్రారంభించిన 5జీ సేవలను దేశం సొంతంగానే అభివృద్ధి చేసిందన్నారు. కొన్ని పరికరాలు మాత్రమే దక్షిణ కొరియాతో పాటు మరికొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని తెలిపారు. 5జీ సేవలు ఇంకా ప్రజలకు చేరాల్సి ఉందన్నారు. 2024 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అక్టోబర్‌ 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సేవలను ప్రారంభించారు. నిర్మాలాసీతారామన్‌ ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ వార్షిక జనరల్‌ బాడీ సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వచ్చారు.

భారత్‌ ప్రారంభించిన యూపీఐ చెల్లింపుల విధానం డిజిటలైజేషన్‌లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందన్నారు. ఈ విధానాన్ని సింగపూర్‌, యూఏఈతో పాటు అనేక దేశాలు అంగీకరిస్తున్నాయని చెప్పారు. రూపే కార్డు, క్రెడిట్‌ కార్డు, క్యూఆర్‌ కోడ్‌ ఇలా అన్ని ఒకే గొడుకు కిందకు నేషనల్‌ పేమెంట్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా తీసుకు వచ్చిందన్నారు. ఏ దేశమైనా ఈ విధానాన్ని కోరితే అందిస్తామన్నారు. డిజిటల్‌ చెల్లింపులు పెరగడం, లద్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు దోహదం చేసిందని, ఇది దీర్ఘకాలంలో దేశం సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ బాగుందని, కోవిడ్‌ మూలంగా రెండు సంవత్సరాలుగా చాలా దేశాల్లో మాదిరిగా దేశంలో జరగలేదని, దీని వల్లే విశ్వాసం పెరిగిందన్నారు. ప్రపంచ ఆర్ధిక మాంద్యం వల్లే ఇండియా ఎగుమతులు తగ్గాయని, డాలర్‌ బలపడటంతో రూపాయి బలహీనపడిందన్నారు. ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ, భౌగోళిక పరిస్థితులను ఇండియా ఎదుర్కొంటుందని చెప్పారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, దీన్ని అందరూ సమిష్టిగానే ఎదుర్కొవాల్సి ఉందన్నారు. దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం అన్ని దేశాలు కలిసి పని చేయాలని సీతారామన్‌ కోరారు. ఈ సంవత్సరం డిసెంబర్‌ 1 నుంచి జీ20 దేశాల కూటమికి ఇండియా సారధ్యం వహించనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement