Saturday, April 27, 2024

మేలోనే 5జీ స్పెక్ట్రం వేలం.. ఈ ఏడాది చివరి నాటికి 5జీ సేవలు

ఇండియాలో 5జీ సేవలు అందించేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ ఏడాదిలోపే 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. ఆ దిశగా కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. 5జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించిన వేలం ఈ ఏడాది మేలోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టెలికాం మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ .. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించిన సిఫార్సులను మార్చి చివరి నాటికి అందజేస్తే.. మేలో వేలం కోసం ఇతర ప్రక్రియలు పూర్తవుతాయని టెలికాం శాఖ కార్యదర్శి కే.రాజారామన్‌ స్పష్టం చేశారు.

వేగంగా ప్రతిపాదనలు..

ఈ సందర్భంగా రాజారామన్‌ మాట్లాడుతూ.. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియను వేగవంతం చేసేందుకు టెలికాం విభాగం సిద్ధంగా ఉందన్నారు. ఇది వరకు ట్రాయ్‌ సిఫార్సు పంపిన తరువాత.. 60-120 రోజులకు వేలం నిర్వహించే వారమని ఆయన గుర్తు చేశారు. అయితే ఈసారి ఈ ప్రక్రియను కేవలం 60 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. వేలం ప్రక్రియకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ ధరలు, బ్లాక్‌ సైజ్‌, కేటాయింపు, చెల్లింపుల నిబంధనల గురించి టెలికాం విభాగం (డీఓటీ) ట్రాయ్‌ నుంచి సిఫార్సులను ఆహానిస్తుంది. ఆ తరువాత ట్రాయ్‌ పరిశ్రమ, ఇతర భాగసామ్యులతో చర్చించిన తరువాత డీఓటీకి ప్రతిపాదనలు వెళ్తాయి. దీనిపై డీఓటీ నిర్ణయం తీసుకున్న తరువాత కేబినెట్‌ ఆమోదానికి పంపిస్తారు. ఆ తరువాతే వేలం ప్రక్రియను నిర్వహిస్తారు. అన్ని ప్రక్రియలు అనుకున్న సమయానికి పూర్తయితే.. 5జీ సేవలు ఈ ఏడాదిలోపే అందుబాటులోకి వస్తాయి. దీంతో 4జీ నెట్‌వర్క్‌ కంటే 10 రెట్ల వేగంతో 5జీ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.

అభిప్రాయాలకు ఫిబ్రవరి 15తుది గడువు..

5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించిన ప్రతిపాదనలు మార్చిలోనే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్‌కు అందజేస్తుందని ఈ నెల ప్రారంభంలోనే టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ఆ తరువాత ఈ ప్రక్రియను డీఓటీ వీలైనంత తరలో పూర్తి చేస్తుందని వివరించారు. వేలం ప్రక్రియ బాధ్యతలను ఇప్పటికే ఎంఎస్‌టీసీని ఎంపిక చేసినట్టు రాజారామన్‌ తెలిపారు. 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించిన అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఫిబ్రవరి 15 వరకు ట్రాయ్‌ గడువు ఇచ్చిందని తెలిపారు. స్పెక్ట్రమ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్‌ ధరలో 95 శాతం వరకు కోత విధించాలని టెలికాం ఆపరేటర్లు డిమాండ్‌ చేశారు. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం కోసం నిబంధనలపై టెలికాం, శాటిలైట్‌ ప్లేయర్‌లు పరస్పరం విభేదిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement