Monday, May 6, 2024

వైఎస్సార్ వాహనమిత్ర పథకం… 2.48 లక్షల మందికి ఆర్థిక సాయం

వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థికసాయాన్ని ఏపీ ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ సొంతంగా కలిగి, వాటిని నడిపే డ్రైవర్లకు వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద రూ.10 వేల చొప్పున మంగళవారం అందించనుంది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బటన్ నొక్కి వారి ఖాతాల్లో మొత్తం రూ.248.47 కోట్లను జమ చేయనున్నారు. 2 లక్షల 48 వేల 468 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందనుంది. గతేడాది 2 లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా.. ఈ ఏడాది కొత్తగా 42 వేల 932 వేల మంది దరఖాస్తు చేశారు.

గతేడాది కంటే ఈసారి 25,517 మంది లబ్ధిదారులు తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద 2019-20లో 2,36,344 మంది, 2020-21లో 2,73,985 మంది సాయం పొందారు. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఇంటి విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగిస్తున్నవారు, మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలకుపైగా ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు పైగా నిర్మిత ప్రాంతం ఉన్నవారు, వేరొక పథకంలో ప్రయోజనం పొందిన వారు… ఈ పథకానికి అర్హులుకాదని కొత్త నిబంధనలను విధించారు. దీంతో గత లబ్ధిదారుల్లో 17,465 మంది, ఏడాదిలో వాహనాలు విక్రయించిన 33,200 మంది అర్హత కోల్పోయారు. వీరిలో అర్హత ఉన్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు, పాత, కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారి దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు మొత్తం 2,48,468 మంది పథకానికి అర్హత సాధించినట్లు తేల్చారు. వీరందరి ఖాతాల్లో నేడు ప్రభుత్వం రూ.10వేల చొప్పున నగదు జమ చేయనుంది.

ఇది కూడా చదవండి: త్వరలో బీజేపీలో భారీ చేరికలు: ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement