Saturday, April 27, 2024

పచ్చపార్టీ నేతలవి నీచ రాజకీయాలు, నవరత్నాలు నవరోగాల్లా కనిపిస్తున్నాయి: వైసీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పదారి పట్టించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు మండిపడ్డారు. ఆ పార్టీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ ఎంపీలు నోటికొచ్చినట్టు అబద్దాలు మాట్లాడుతున్నారంటూ వారి తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనకూడని, వారి స్థాయికి సరిపోని మాటలు టీడీపీ ఎంపీలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 48 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారన్న ఆయన, అక్కడ చెవిలో పూలు పెట్టుకున్న వారెవరూ లేరని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నెలల్లో లక్ష 75 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, లక్షా 32 వేల కోట్లు నేరుగా ఖాతాల ద్వారా అందజేశారని వివరించారు. కాగ్ అడిగిన అంశాల పై ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానమిచ్చారన్నారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఆదుకున్నారని, ముఖ్యమంత్రి నవ రత్నాల రూపంలో రాష్ట్రానికి మంచి చేయాలని చూస్తున్నారని భరత్ తెలిపారు. టీడీపీకి నవ రత్నాలు నవ రోగల్లా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

చంద్రబాబు హయంలో రేషన్ కార్డు, ఇతర సంక్షేమ ఫలాలు అందాలంటే లంచాలు తీసుకునే వారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో బెల్టు షాపులుండేవని, ఇప్పుడు ఒక్క బెల్డు షాపు కూడా లేదని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో రాజధానిలో ఒక్క పక్కా భవనం కట్టలేదని ఎద్దేవా చేశారు. సింగపూర్‌లా రాజధాని కట్టాలంటే 2 లక్షల కోట్లు కావాలి, వాటిని ఎక్కణ్నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారో రామ్మోహన్ నాయుడు చెప్పాలని ఎంపీ భరత్ నిలదీశారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగిందని ఆయన తెలిపారు. చంద్రబాబు, జగన్ చరిత్ర బేరీజు వేసి చూస్తే… బాబు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్నారని, జగన్ సోనియాను ఎదిరించి పార్టీ పెట్టి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉగాది నాటికి 26 జిల్లాలు ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంటే టీడీపీ నేతలు కుప్పం, హిందూపూర్ పరిస్థితి ఏమిటని వారు అడుగుతున్నారన్నారు. మీ హయాంలో ఏం చేశారు? ఇలా మాట్లాడ్డానికి సిగ్గనిపంచడం లేదా? అంటూ భరత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణాకు కూడా 69 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement