Wednesday, May 8, 2024

రూ.100బ్యాంక్ ట్రాన్జాక్షన్ తప్పు కాదు, 48 వేల కోట్ల ప్రజాధనం ఎలా దుర్వినియోగమవుతుంది?

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వంద రూపాయల బ్యాంక్ ట్రాన్జాక్షన్ కూడా తప్పుగా జరిగే పరిస్థితి లేనప్పుడు 48 వేల కోట్ల ప్రజాధనం ఎలా దుర్వినియోగమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 48 వేల కోట్ల అవినీతి జరిగిందంటూ టీడీపీ ఎంపీలు చేసిన ఆరోపణలపై మాట్లాడారు. 2022-23 ఏపీ బడ్జెట్ చూశాక టీడీపీకి అంకెల గారడీ అని మాట్లాడే పరిస్థితి లేదని, యనమల మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని విస్మయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎటువంటి పరిశీలన లేకుండా ఆర్భాటంగా ప్రవేశపెట్టిన సీఎంఫ్‌ఎంఎస్ తప్పులను సరిచేయడానికే సంవత్సరాలు పడుతుందని, 48,509 కోట్లు స్పెషల్ బిల్లుల రూపంలో ఉన్నాయని బుగ్గన వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏదో అయిపోతోందని వాదిస్తున్న వారికి అకౌంట్స్, ఆడిట్‌కు మధ్య తేడా తెలియకపోవడం విచారకరమని ఎద్దేవా చేశారు. అక్కౌంట్స్‌లో తప్పులుంటే ఆడిట్‌లో బయటపడుతుందనే విషయం విమర్శలు చేస్తున్న వారికి తెలియదా అని ప్రశ్నించారు. 15 అంశాల వారీగా ప్రతి దానికీ పద్దు ఉందని స్పష్టం చేశారు. ఎక్కడా నిధులు దుర్వినియోగం జరగలేదన్న మంత్రి, అంశాల వారీగా కాగ్‌కు నివేదిక ఇచ్చామని తెలిపారు. అన్యాయంగా, దుర్మార్గంగా ప్రభుత్వాన్నినిందించడం తప్పని ఆయన అభిప్రాయపడ్డారు.

2018-19లో టీడీపీవి కుడా 98 వేల బుక్ అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయని, సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను టీడీపీ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టిందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించామని తెలిపారు. ఒక రోజు ఆదాయం వచ్చిందని, ఒకరోజు రాలేదని ఆరోపణలు చేస్తారని, యనమల ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని మంత్రి సూచించారు. 2020-21లో 30 వేల కోట్ల ఆదాయం తగ్గినా కోవిడ్ పరిస్థితుల్లో సామాన్యులను కాపాడుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానివి డీబీటీ పథకాలన్న బుగ్గన, దేనికెంత ఖర్చు చేసిందో అన్ని లెక్కలూ ఉన్నాయని నొక్కి చెప్పారు. 2017-18లో టీడీపీ హయాంలో 82 వేల కోట్లు కనపడని ఖర్చు ఉందన్నారు. గత ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు కత్తెర, దువ్వెన పంచిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల పిల్లలకు చదువునిచ్చి డాక్టర్లను, ఇంజనీర్లను చేస్తోందని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం పిల్లల చదువుల కోసం-పేదవాడి కోసం అప్పులు చేస్తుందన్న ఆయన, చంద్రబాబు హయాంలో కత్తెర, ఇస్త్రీ పెట్టెల కోసం కూడా అప్పులు చేశారని ఆరోపించారు.

ఏపీలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ పెట్టాలని 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఆరోపణలు మొదలుపెట్టారని మంత్రి చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం 40 వేల కోట్లు బకాయిలు పెట్టినందుకు, పోలవరం భ్రష్టు పట్టించినందుకు ఎమర్జెన్సీ పెట్టాలా అని ప్రశ్నించారు. 10 లక్షల కోట్లయ్యే రాజధాని నిర్మాణానికి ఎక్కువ నిధులు ఖర్చు చేయనందుకు, ఓటుకి నోటు కేసులో పారిపోయి వచ్చినందుకు, కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నందుకు ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలా? అని రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ ప్రశ్నించారు. సీబీఐ విచారణ ఓటుకు నోటు కేసు కోసం పెట్టాలా? టిడ్కోపై సీబీఐ దర్యాప్తు పెట్టాలా? ఫైబర్ గ్రిడ్‌పై సీబీఐ దర్యాప్తు పెట్టాలా? అని నిలదీశారు. టీడీపీ నేతల్లా పని లేకుండా ఎవరూ లేరని, కాగ్‌కి పూర్తి స్థాయి వివరాలు అందజేశామని ఆయన వివరించారు. రివర్స్ టెండర్, సచివాలయాలు, నవరత్నాలు వంటి పనుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతోందని మంత్రి బుగ్గన హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement